చివరి గంటలో పతనమైన మార్కెట్లు: సెన్సెక్స్ 450 పాయింట్ల లాభం నుండి, అంతే నష్టాల్లోకి..
స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఏప్రిల్ 29) లాభాల్లో ప్రారంభమై, దాదాపు చివరి గంట వరకు అదే ఒరవడితో కొనసాగినప్పటికీ, చివరలో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఉదయం ఏ మేర లాభంతో కదలాడాయో అంతస్థాయిలో పతనమయ్యాయి. క్రితం సెషన్‌లో సెన్సెక్స్ 57,521 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 57,000 పాయింట్ల స్థాయిలో ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 57,817.51 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,975.48 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,902.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 460 పాయింట్లు లేదా 0.80 శాతం క్షీణించి 57,060 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 57,521 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఓ సమయంలో 57,000 పాయింట్ల దిగువకు పడిపోయినప్పటికీ, చివరకు 57,060 పాయింట్ల వద్ద ముగిసింది.

చివరి గంట వరకు దాదాపు 500 పాయింట్ల లాభాల్లో కనిపించిన సెన్సెక్స్, ఆ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తి కుప్పకూలింది. చివరి అరగంటలో అయితే అమ్మకాలు భారీగా పెరిగాయి. యాక్సిస్ బ్యాంకు, రిలయన్స్, మారుతీ వంటి దిగ్గజ షేర్ల పతనం సూచీలను కిందకు లాగింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలోని అనిశ్చితి నేపథ్యంలో సోమవారానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయోననే ఆందోళన ఇన్వెస్టర్లలో కనిపించింది. కార్పోరేట్ మిశ్రమ ఫలితాలు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. చైనాలో కరోనా వ్యాప్తి కూడా సెంటిమెంటును దెబ్బతీసింది.