చైనాకు భారత్ బిగ్ షాక్.. లడఖ్‌లో ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్.. పూర్తి వివరాలు ఇవే..
Ladakh Railway Project: భారతదేశం హిమాలయ పర్వత శ్రేణులలో అత్యంత వ్యూహాత్మకమైన, ప్రపంచాన్ని విస్మయపరిచే భారీ రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. దేశ సరిహద్దు ప్రాంతాలలో రక్షణ రవాణాను సులభతరం చేయడంతో పాటు పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రతిష్టాత్మక ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్‌ను నిర్మించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. సుమారు 489 కిలోమీటర్ల పొడవైన బిలాస్‌పూర్ మనాలి లేహ్ రైల్వే కారిడార్ నిర్మాణానికి సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వేను పూర్తి చేసి, సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేసింది. అత్యంత క్లిష్టమైన హిమాలయ భూభాగంలో చేపట్టనున్న ఈ భారీ ఇంజనీరింగ్ అద్భుతం కోసం సుమారు 1. 31 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి తుది దశ నిర్మాణ అనుమతులు త్వరలోనే అధికారికంగా ఖరారు కానున్నాయి.

ఈ రైల్వే మార్గంలో లడఖ్‌లోని టెంగ్లా ప్రాంతంలో నిర్మించతలపెట్టిన రైల్వే స్టేషన్ ఈ ప్రాజెక్టుకే తలమానికంగా నిలవనుంది. మనాలి లేహ్ రహదారి సమీపంలో ఉన్న అత్యంత ఎత్తైన టాంగ్లాంగ్ లా పర్వత ప్రాంతం దిగువన రూపుదిద్దుకోనున్న ఈ స్టేషన్ సముద్ర మట్టానికి సుమారు 17, 244 అడుగుల ఎత్తులో ఉండనుందని అంచనా. ఈ నిర్మాణం పూర్తయితే చైనాలోని 5 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న తంగుళా స్టేషన్ రికార్డు తలకిందులై.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్‌గా భారత్ సరికొత్త చారిత్రక రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది.
కాగా ఈ భూగోళం అత్యంత సవాలుతో కూడుకున్న పర్వత ప్రాంతం కావడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఇంజనీరింగ్ సవాళ్లు ఎదురుకానున్నాయి. ఈ మొత్తం రైల్వే మార్గంలో దాదాపు యాభై ఐదు శాతానికి పైగా.. అంటే సుమారు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం కేవలం సొరంగాల మార్గాల గుండానే సాగనుంది. మొత్తం అరవైకి పైగా సొరంగాలను తవ్వి ఈ మార్గాన్ని అనుసంధానించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ రైల్వే కారిడార్ హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాలలోని బిలాస్‌పూర్, మండి, మనాలి, కీలాంగ్, సర్చు, రుమ్ట్సే, ఉప్షి వంటి అనేక కీలకమైన పట్టణాలను అనుసంధానించనుంది.
ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఢిల్లీ నుంచి లేహ్ ప్రాంతానికి ప్రయాణించే సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, దేశ రక్షణ దళాలకు, మారుమూల ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు ఎంతో సులభతరమవుతాయి. సాంకేతికంగా అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ సాగుతున్న ఈ ప్రాజెక్టు దేశ మౌలిక రంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది.


Click it and Unblock the Notifications
