LIC ఏజెంట్ నుంచి రూ. 40,000 కోట్ల సామ్రాజ్యం వరకు.. ఈయన ప్రయాణం అద్భుతం!
చాలామంది 60 ఏళ్లు రాగానే ఉద్యోగానికి రిటైర్మెంట్ ఇచ్చేసి, పెన్షన్ డబ్బులతో ప్రశాంతంగా గడపాలని అనుకుంటారు. కానీ లచ్మన్ దాస్ మిట్టల్ (Lachhman Das Mittal) కథ దీనికి పూర్తి విరుద్ధం. జీవితం 60 ఏళ్ల తర్వాతే మొదలవుతుందని ఆయన నిరూపించారు. 93 ఏళ్ల వయసులో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా-2024లో చోటు సంపాదించుకుని, భారతదేశపు అత్యంత వృద్ధ బిలియనీర్‌గా రికార్డు సృష్టించారు. గతంలో ఈ గౌరవం కేశుబ్ మహీంద్రా పేరిట ఉండేది, ఆయన మరణం తర్వాత మిట్టల్ ఈ స్థానాన్ని దక్కించుకున్నారు.

ఎల్‌ఐసీ ఏజెంట్ నుంచి ప్రస్థానం
ఈ అద్భుతమైన సక్సెస్ స్టోరీ (Success story) 1955లో ప్రారంభమైంది. మిట్టల్ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిలాగే తన జీవితాన్ని ప్రారంభించారు. మొదట ఆయన ఎల్‌ఐసీ (LIC) ఏజెంట్‌గా పనిచేశారు. సాధారణ ఆదాయం, క్రమశిక్షణతో కూడిన పొదుపుతోనే ఆయన జీవితం గడిచేది. చదువులో ఆయన చాలా చురుకైన వారు. ప్రభుత్వ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఉర్దూ , ఇంగ్లీష్ భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అంతేకాదు, ఎంఏ ఇంగ్లీష్‌లో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. ఆయనలోని ఈ క్రమశిక్షణే భవిష్యత్తులో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి పునాది వేసింది.
ఎదురుదెబ్బలు తగిలినా వెనక్కి తగ్గలేదు
అయితే, మిట్టల్ విజయపథం పూలబాట ఏమీ కాదు. తన పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యవసాయ పరికరాల వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ ఆ వ్యాపారం ఘోరంగా విఫలమైంది. ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ఆయన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఓటమిని చూసి భయపడి ఇంట్లో కూర్చోకుండా, మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాలని నిశ్చయించుకున్నారు. 1996లో తన 60వ ఏట ఉద్యోగ విరమణ చేసిన తర్వాత, తన వద్ద ఉన్న కొద్దిపాటి పొదుపుతో 'సోనాలిక గ్రూప్' (Sonalika Group) స్థాపించారు. ట్రాక్టర్ల తయారీపై దృష్టి సారించారు.
ప్రపంచవ్యాప్త సామ్రాజ్యం
నేడు సోనాలిక గ్రూప్ ఒక అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదిగింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. దాదాపు 120కి పైగా దేశాలకు సోనాలిక ట్రాక్టర్లు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం లచ్మన్ దాస్ మిట్టల్ నికర ఆస్తుల విలువ దాదాపు 4.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 40,000 కోట్లు). 93 ఏళ్లు వచ్చినా, ఆయన ఇప్పటికీ వ్యాపార విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆయన కుమారులు అమృత్ సాగర్ మిట్టల్, దీపక్ మిట్టల్ వ్యాపార బాధ్యతలు చూస్తున్నప్పటికీ, లచ్మన్ దాస్ గారు నిత్యం కార్యాలయానికి వెళ్తూ కీలక నిర్ణయాల్లో తన సలహాలను అందిస్తుంటారు.
విజయానికి వయసుతో సంబంధం లేదని, పట్టుదల ఉంటే ఎప్పుడైనా చరిత్ర సృష్టించవచ్చని చెప్పడానికి ఈయన జీవితం ఒక గొప్ప ఉదాహరణ. లచ్మన్ దాస్ మిట్టల్ ప్రయాణం నేటి యువతకు, రిటైర్మెంట్ దశలో ఉన్న వారికి ఒక గొప్ప పాఠం. సాధారణంగా వృద్ధాప్యం రాగానే కొత్త పనులు చేయడానికి చాలామంది వెనకడుగు వేస్తారు. కానీ, మనసులో సంకల్పం ఉంటే తొంభై ఏళ్ల వయసులో కూడా ప్రపంచ స్థాయి బిలియనీర్ల జాబితాలో నిలవవచ్చని ఆయన నిరూపించారు. కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా వ్యవసాయ రంగానికి ఆధునిక ట్రాక్టర్లను అందించడం ద్వారా ఆయన దేశాభివృద్ధిలో కూడా పాలుపంచుకున్నారు. ఏ రంగంలోనైనా గెలవాలంటే కావాల్సింది వయసు కాదు, ఆగిపోని ఆశయం, నిరంతరం శ్రమించే తత్వం అని మిట్టల్ గారి జీవితం మనకు గుర్తుచేస్తోంది


Click it and Unblock the Notifications