బంగారం ధర కుప్పకూలే వార్త బయటకు.. పాదరసం నుంచి పసిడి.. అమెరికా స్టార్టప్ ప్రయోగం ఏం చెబుతోంది..
Lab-Grown Gold: ప్రాచీన కాలంలో Alchemists ఏ లోహన్నైనా బంగారంగా మార్చవచ్చని చేసిన ప్రయత్నాలు కేవలం కల్పనగానే మిగిలిపోయాయి. కానీ ఆధునిక సాంకేతిక యుగంలో ఆ సైన్స్ ఫిక్షన్ నిజరూపం దాల్చుతోంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న టెక్ స్టార్టప్ మారథాన్ ఫ్యూజన్ (Marathon Fusion) చేసిన ఒక సంచలన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. న్యూక్లియర్ ఫ్యూజన్ (పరమాణు సంలీనం) సాంకేతికతను ఉపయోగించి పాదరసాన్ని (Mercury) నిజమైన, స్థిరమైన బంగారంగా విజయవంతంగా మార్చామని ఆ సంస్థ ప్రకటించింది. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (CERN) గతంలో సాధించిన రికార్డును తాము పది రెట్లు అధిగమించామని కంపెనీ వెల్లడించింది.
ఈ అద్భుత ప్రక్రియ వెనుక ఉన్న శాస్త్రీయ విధానాన్ని పరిశీలిస్తే.. ఇది సాధారణ రసాయన చర్యల వంటిది కాకుండా న్యూక్లియర్ ట్రాన్స్‌మ్యూటేషన్ ద్వారా జరుగుతుంది. డ్యూటరియం-ట్రిట్రియం ఫ్యూజన్ ప్రతిచర్యల ద్వారా విడుదలయ్యే అత్యధిక శక్తి కలిగినన్యూట్రాన్లను ఉపయోగించి సహజంగా లభించే పాదరసం-198 (Mercury-198) అనే స్థిరమైన ఐసోటోప్‌ను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ న్యూట్రాన్లు పాదరసం కేంద్రకాన్ని తాకినప్పుడు అది అస్థిరమైన పాదరసం-197గా మారుతుంది. ఆ తర్వాత అది క్షీణించి స్థిరమైన బంగారం-197గా రూపాంతరం చెందుతుంది. శాస్త్రవేత్తలు చాలా కాలం క్రితమే ఈ భౌతిక సూత్రాన్ని నిరూపించినప్పటికీ.. వాణిజ్యపరంగా భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం ఇప్పటివరకు అసాధ్యంగా ఉండేది.

అయితే మారథాన్ ఫ్యూజన్ చేసిన ఈ ప్రకటనపై ఆర్థిక, శాస్త్రీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీ తాము ఎంత బంగారాన్ని ఉత్పత్తి చేశామనే వివరాలను పూర్తిగా వెల్లడించకపోవడం, ఈ ప్రయోగంపై ఇప్పటివరకు స్వతంత్ర శాస్త్రీయ ధృవీకరణ (Independent Peer Review) రాకపోవడం గమనార్హం. కేవలం సోషల్ మీడియా వేదికగా కొన్ని గామా-రే స్పెక్ట్రమ్ గ్రాఫ్‌లను మాత్రమే కంపెనీ పంచుకుంది. అయినప్పటికీ భవిష్యత్తులో ఈ సాంకేతికత వాస్తవ రూపం దాల్చి వాణిజ్య స్థాయిలో అమల్లోకి వస్తే.. అది అంతర్జాతీయంగా విలువైన లోహాల మార్కెట్‌ను, పసిడి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న తరుణంలో.. ఈ ప్రయోగం భవిష్యత్తులో పసిడి సరఫరా గొలుసును పూర్తిగా మార్చివేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఫ్యూజన్ ప్లాంట్ల ద్వారా భారీ ఎత్తున బంగారం ఉత్పత్తి జరిగితే.. సహజసిద్ధమైన బంగారానికి ఉండే కొరత తగ్గి ధరలు భారీగా పడిపోయే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రేడియోధార్మిక ఉపఉత్పత్తులను సురక్షితంగా నిర్వహించడం, పెద్ద ఎత్తున వాణిజ్య ఉత్పత్తిని సాధించడం వంటి సవాళ్లు ఇంకా చాలానే ఉన్నాయి. ఈ సంచలన ప్రయోగం నిజంగానే భవిష్యత్తులో పసిడి ధరలను కుప్పకూలిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
