L&T News: లేఆఫ్స్‌తో విసుగెత్తిన యువతకు L&T గుడ్‌న్యూస్.. ఆ విభాగంలో 10 శాతం రిక్రూట్‌మెంట్
Recruitment: కొత్త ఏడాదిలోనైనా ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తున్న ఆశావహులకు ఈసారి నిరాశే ఎదురైంది. కనీసం నెల కూడా గడవక ముందే పలు దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ L&T శుభవార్త చెప్పింది. ఇక్కడి యువత ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్న క్రమంలో ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.
పశ్చిమాసియా దేశాల్లో ప్రత్యేకించి సౌదీ అరేబియాలో తన శ్రామికశక్తిని విస్తరించాలని లార్సెన్ & టూబ్రో (L&T) చూస్తున్నట్లు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) శంకర్ రామన్ తెలిపారు. ఇందుకు అనుగుణంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్యాబ్రికేషన్ షాపుల్లో స్థానిక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లు శిక్షణ పొందేలా ప్రోత్సహిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

గత సంవత్సరంలో 10 శాతం మంది సిబ్బందిని పెంచుకోగా.. వచ్చే ఏడాది మరో 10 శాతం విస్తరించాలని కంపెనీ యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 'డిసెంబర్ 2022 నుంచి ఇప్పటివరకు ప్రధానంగా ఇంజినీరింగ్‌లో 10-11 శాతం మందిని రిక్రూట్ చేసుకున్నాము. అట్రిషన్ రేటు మరియు ప్రతిభకు డిమాండ్‌ను పరిగణలోనికి తీసుకుంటే దాదాపు మరో 10 శాతం శ్రామికశక్తిని పెంచుకోవాలని చూస్తున్నాం' అని పేర్కొన్నారు.
దాదాపు 16 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులు చేతిలో ఉండటంతో మరో రెడున్నరేళ్లు పూర్తి బిజీగా ఉన్నట్లు రామన్ చెప్పారు. మార్చి 31, 2023 నాటికి కంపెనీలో 49 వేలకు పైగా శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 3 వేల 500 మంది మహిళలు కాగా మిగిలిన వారు పురుషులు. ఇక కాంట్రాక్ట్ ప్రాతిపదికన 2 లక్షల 30 వేల వరకు కార్మికులు పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications