లోన్ మారటోరియం ముగిసినందున ఊరట కల్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన గైడ్ లైన్స్ ప్రకటించనుంది. ఇందుకు కేవీ కామత్ కమిటీని నియమించింది. ఈ కమిటీ చేసిన సిఫార్సులకు ఆర్బీఐ అంగీకారం తెలిపింది. కరోనా నేపథ్యంలో రుణాల పునర్వ్యవస్థీకరణ మార్గదర్శకాల కోసం ఈ కమిటీని ఆగస్ట్ 7న ప్రకటించినది. ఈ నెల 4న కమిటీ తమ నివేదికను సమర్పించింది. 26 రంగాలను రుణ పునర్వ్యవస్థీకరణకు పరిగణలోకి తీసుకోవాలని కామత్ కమిటీ సూచించింది.

26 రంగాల్లో రుణ పునర్వ్యవస్థీకరణ
కరోనాకు సంబంధించిన ఒత్తిడి రుణాల పరిష్కారానికి అవసరమైన ఆర్థిక పరిమితులపై సిఫార్సులు చేసింది కేవీ కామత్ కమిటీ. నివేదిక సమర్పించిన నేపథ్యంలో కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన 26 రంగాల్లో రుణాల పునర్వ్యవస్థీకరణ కోసం ఆర్బీఐ సోమవారం ఓ సర్క్యులర్ జారీ చేసింది. కరోనా పరిణామాలతో ఏర్పడిన ఒత్తిడి రుణాల పరిష్కారం నిమిత్తం రంగాల ఆధారిత పరిమితులను, ఐదు ఆర్థిక నిష్పత్తులను ఆర్బీఐ నిర్దేశించింది. ఈ నివేదికలోని సుఫార్సుల ఆధారంగా ఒత్తిడి రుణాలను పరిష్కరించనుంది.

ఈ ఆర్థిక నిష్పత్తుల ఆధారంగా
కమిటీ చేసిన సిఫార్సులకు ఆర్బీఐ దాదాపు అంగీకారం తెలిపింది. ఈ రంగాలకు రుణపునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ఖరారు చేసేముందు ఐదు ఆర్థిక నిష్పత్తులను, రంగాల ఆధారిత పరిమితులను రుణ సంస్థలు పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. కామత్ కమిటీ సూచించిన ప్రధాన ఆర్థిక నిష్పత్తుల్లో మొత్తం బయటి బకాయిలు-సర్దుబాటు చేసిన నికర వ్యాల్యూ, మొత్తం రుణం-ఎబిటా, ప్రస్తుత ఆస్తులు-అప్పుల నిష్పత్తి, డెట్ సర్వీస్ కవరేజీ రేషియా, సగటు డెట్ సర్వీస్ కవరేజీ నిష్పత్తి ఉన్నాయి.

ఈ రంగాలకు...
ఆర్బీఐ నిర్దేశించిన 26 రంగాల్లో ఆటో, ఆటో విడిభాగాలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, వాహన తయారీ, ఆటో డీలర్‌షిప్స్, చక్కెర, విద్యుత్, పర్యాటకం, సిమెంట్, రసాయనాలు, ఆభరణాలు, రత్నాలు, సరుకు రవాణా, మైనింగ్, తయారీ, స్థిరాస్తి, షిప్పింగ్, విమానయానం, తయారీ, నిర్మాణ తదితర రంగాలు ఉన్నాయి. వీటి రుణాలను ఈ ప్రమాణాల ఆధారంగా బ్యాంకులు పునర్వ్యవస్థీకరించుకోవచ్చు.


Click it and Unblock the Notifications