Indriya Brand: భారతీయులకు పసిడి అంటే ఎంత మక్కువో ప్రపంచం మెుత్తానికి తెలుసు. ఈ క్రమంలో ఈ రంగంలో ఉన్న అపారమైన వ్యాపార అవకాశాలను వినియోగించుకోవటానికి పెద్దదిగ్గజ వ్యాపారవేత్తలు సైతం రంగంలోకి దిగుతున్నారు.
తాజాగా ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా దేశీయ స్వర్ణాఆభరణాల వ్యాపారంలోకి 'ఇంద్రియ' అనే బ్రాండ్ పేరుతో అడుగుపెడుతున్నారు. రూ.6.7 లక్షల కోట్లు విలువైన భారతీయ ఆభరణాల మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైంది. ఆభరణాల వ్యాపార రిటైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.5,000 కోట్లు కేటాయించినట్లు గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో రానున్న ఐదేళ్లలో జ్యువెలరీ రంగంలో టాప్-3 రిటైలర్‌లలో ఒకటిగా నిలవాలని గ్రూప్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

ఇందులో భాగంగా ముందు దిల్లీ, ఇండోర్, జైపూర్ నగరాల్లో ఇంద్రియ బ్రాండ్ నాలుగు స్టోర్లు ఏర్పాటుకానున్నాయి. అలాగే శరవేగంతో బిర్లా గ్రూప్ ఆరు నెలల్లో 10 కంటే ఎక్కువ నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది. బిర్లా గ్రూప్ దాని బలమైన బ్రాండ్ ఈక్విటీ, లోతైన మార్కెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా వినియోగదారుల పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేస్తోంది. ఈ బ్రాండ్‌లో 13 నగరాల్లో 3,500 మంది కళాకారులు రూపొందించిన 15,000 ఆభరణాలు ఉన్నాయి. ప్రతి 45 రోజులకు స్టోర్లలో కొత్త డిజైన్లను ప్రవేశపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. ఈ స్టోర్లు సగటు జాతీయ బ్రాండ్‌ల కంటే 40 శాతం పెద్దవిగా ఉంటాయన్నారు.
బిర్లా గ్రూప్ బ్రాండ్ పేరు ఇంద్రియ అనేది సంస్కృత పదం. ఈ భాష నిజంగా భారతదేశం గొప్ప సంస్కృతికి మరొక పేరు. సరళంగా చెప్పాలంటే ఇంద్రియ అంటే దేవతల దేవుడైన ఇంద్రుడికి సంబంధించినదిగా తెలుస్తోంది. 'ఇంద్రియ'తో బ్రాండెడ్ జ్యువెలరీ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత ఆదిత్య బిర్లా గ్రూప్.. టాటా గ్రూప్ తనిష్క్, రిలయన్స్ జ్యువెల్స్‌తో పోటీపడుతుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఫ్యాషన్ రిటైల్, లైఫ్ స్టైల్ పరిశ్రమలో ఉన్న గ్రూప్‌కు ఈ ప్రవేశం సహజమైన విస్తరణగా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications