టెలికాం రంగంలో టారిఫ్ వార్, రిలయన్స్ జియో ఎంట్రీతో మొబైల్ వినియోగదారులు లాభపడినా.. కోట్లాది రూపాయల పెట్టుబడులు గుమ్మరించిన పలు కంపెనీలు చేతులు కాల్చుకున్నాయనే చెప్పాలి.
టెలికాం రంగంలో టారిఫ్ యుద్ధం ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా సంపదకు భారీగా గండి కొట్టింది.
అంతేకాదు, దేశంలో ఆర్థిక మందగమనం, డిమాండ్ లేమి వంటి అంశాలు సైతం ఆయన ఆస్తిని కరిగించేశాయి. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 2017 చివరి నాటికి 910 కోట్ల డాలర్లుగా (రూ.65,520 కోట్లు) ఉన్న కుమార మంగళం బిర్లా ఆస్తి ప్రస్తుతం 594 కోట్ల డాలర్లకు (రూ.42,768 కోట్లు) పడిపోయింది. అంటే రెండేళ్లలో ఆయన సంపద రూ.22,752 కోట్ల మేర తరిగిపోయిందన్నమాట.

జియో రంగ ప్రవేశంతో...
రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌తోపాటు ఆదిత్య బిర్లా గ్రూపు కంపెనీ ఐడియా సెల్యులార్ కూడా కుదేలైన సంగతి తెలిసిందే. జియో నుంచి పోటీని తట్టుకునేందుకు గతేడాది వొడాఫోన్, ఐడియా ఒక్కటై వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా ఏర్పడ్డాయి. అయితే విలీనం తర్వాత కూడా ఈ రెండు గ్రూపుల కష్టాలు తీరలేదు. వొడాఫోన్ ఐడియా కస్టమర్లు ఎంఎన్‌పీ ద్వారా పెద్ద సంఖ్యలో జియోకు తరలిపోయారు. దీంతో కంపెనీ నష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయింది.

చేతులు కాల్చుకున్న ఆదిత్య బిర్లా గ్రూపు...
టెలికాం రంగంలో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్న వారి జాబితాలో ఆదిత్య బిర్లా గ్రూపు కూడా చేరింది. వొడాఫోన్ ఐడియాలో ఈ గ్రూప్‌నకు 27 శాతం వాటా ఉంది. అయితే 2017 చివరి నుంచి వొడాఫోన్ ఐడియా షేర్లు 90 శాతం మేర నష్టపోయాయి. దాంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 260 కోట్ల డాలర్ల మేర తరిగిపోయింది. దీంతో ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్ కుమార మంగళం బిర్లా సంపద హరించుకుపోయింది. 2017 చివరి నాటికి 910 కోట్ల డాలర్లుగా (రూ.65,520 కోట్లు) ఉన్న కుమార మంగళం బిర్లా ఆస్తి.. ప్రస్తుతం 594 కోట్ల డాలర్లకు (రూ.42,768 కోట్లు) పడిపోయింది. అంటే రెండేళ్లలో ఆయన సంపద రూ.22,752 కోట్ల మేర తరిగిపోయింది.

హిందాల్కో లాభంలోనూ 33 శాతం క్షీణత...
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. ఆ ప్రభావం మన దేశంపైనా పడింది. దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం దెబ్బకు ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఇతర కంపెనీలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం రోలింగ్ కంపెనీ. అయితే మందగమనం కారణంగా పారిశ్రామిక ముడిసరుకులకు డిమాండ్ తగ్గడంతో కమోడిటీ ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో హిందాల్కో లాభం 33 శాతం క్షీణించింది. 2017 చివరి నుంచి కంపెనీ విలువ 30 శాతం పైగా పతనమైంది.

గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పరిస్థితీ అంతంత మాత్రమే...
ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన మరో కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్.. ప్రస్తుతం టెక్స్‌టైల్, ఫ్యాషన్ వస్త్రాలు, ఆర్థిక సేవలు, రసాయనాలు, ఎరువులు సిమెంట్, ఆర్థిక సేవల వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఆర్థిక మందగమనం కారణంగా ఈ కంపెనీ సిమెంట్, రసాయనాలు, టెక్స్‌టైల్ ఉత్పత్తులకూ డిమాండ్ తగ్గింది. దాంతో 2017 చివరి నుంచి గ్రాసిమ్ షేర్లు కూడా 33 శాతం పతనమయ్యాయి. పైగా గ్రాసిమ్‌కు వొడాఫోన్ ఐడియాలోనూ 11.54 శాతం వాటా ఉంది. వొడాఫోన్ ఐడియా షేర్ల క్షీణత ప్రభావం గ్రాసిమ్ మార్కెట్ విలువపైనా పడింది. దీంతో ఈ కంపెనీకి నష్టాలు తప్పలేదు.


Click it and Unblock the Notifications