IPO News: డబ్బులు రెడీ చేసుకోండి ఇన్వెస్టర్స్.. మార్కెట్లోకి వస్తున్న పెద్ద ఐపీవో..
IPO News: 2023 చివరి నెల డిసెంబర్ మెుదలైనప్పటికీ ఐపీవోల రాకలో దూకుడు ఏమాత్రం తగ్గనేలేదు. దీనికి తోడు కొత్తగా మరో ఐపీవో కూడా తమ అరంగేట్రం కోసం సిద్ధమైంది.
ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుల కోసం ఆటో విడిభాగాల తయారీ సంస్థ క్రాస్ లిమిటెడ్(kross Ltd) తన ఐపీవోను తీసుకొస్తోంది. తాజా ఐపీవో ప్రణాళిక ద్వారా కంపెనీ సుమారు రూ.500 కోట్లను సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. దీనికోసం ఇప్పటికే కంపెనీ ముసాయిదాను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద దాఖలు చేసింది. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ కు చెందిన కంపెనీ ఐపీవోలో ఫ్రెష్ ఈక్విటీ షేర్ల ద్వారా రూ.250 కోట్లను సమీకరించాలని నిర్ణయించగా.. మిగిలిన రూ.250 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్ల వాటా విక్రయిస్తున్నట్లు DRHP ప్రకారం వెల్లడైంది.

ఆఫర్ ఫర్ సేల్ కింద కంపెనీ ప్రమోటర్ సుధీర్ రాయ్ రూ.168 కోట్ల విలువైన షేర్లను, అనితా రాయ్ రూ.82 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. ఐపీవోకి ముందర కంపెనీ రూ.50 కోట్ల వరకు విలువైన షేర్లను ప్రైవేట్ ప్లేస్‌మెంట్ చేయవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే ఐపీవో ఇష్యూ పరిమాణం తగ్గే అవకాశం ఉంది. తాజా ఐపీవో నుంచి సేకరించిన మెుత్తంలో రూ.70 కోట్లను యంత్రాల కొనుగోలుకు వినియోగిస్తోంది. అలాగే రూ.90 కోట్లను రుణాల చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని కంపెనీ నిర్ణయించింది.
మార్చి త్రైమాసికంలో రాయ్ కుటుంబం ప్రమోట్ చేసిన కంపెనీ లాభం 154.2 శాతం పెరిగి రూ.30.93 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 64.3 శాతం పెరిగి రూ.488.6 కోట్లకు చేరుకుంది. అదే కాలంలో EBITDA దాదాపు 95 శాతం వేగంగా వృద్ధి చెంది రూ.57.5 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications