KPMG Report: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలకు భారత సంతతికి చెందిన వ్యక్తులు సీఈవోలుగా, ఉన్నత స్థాయి నాయకులుగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నారు. అయితే ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థ KPMG వీరి సర్వే ద్వారా సంచలన రిపోర్ట్ విడుదల చేసింది.
కేపీఎంజీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1,300 మంది సీఈవోలతో ఒక సర్వే నిర్వహించింది. దీనిలో దాదాపు 125 మంది భారతీయ సీఈవోలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో భౌగోళిక రాజకీయాలు, విస్తృత రాజకీయ అనిశ్చితులు ప్రస్తుతం వ్యాపార వృద్ధికి అత్యంత ప్రమాదకరమైనవిగా ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇలాంటి సమయంలో కంపెనీలు సైతం తమ పనితీరును మెరుగుపరుచుకునేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వీటిలో ముఖ్యమైనది ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాలని కోరటం.

చాలా ఐటీ సేవల కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ తప్పనిసరి చేస్తూ ఇటీవలి కాలంలో ఆదేశాలు జారీ చేశాయి. అమెజాన్ సైతం ఆఫీసులకు రాని వారిని తొలగించేందుకు మేనేజర్లకు తగిన ఆదేశాలను అందించింది. సర్వేలో పాల్గొన్న 89 శాతం మంది భారతీయ సీఈవోలు తమ మదిలోని విషయాలను బయటపెట్టారు. ఆఫీసులకు తిరిగి వచ్చే ఉద్యోగులకు రివార్డ్స్ ఇవ్వాలని వారు చూస్తున్నారు. అలాగే ప్రమోషన్లు, వేతన పెంపులు, అనుకూలమైన అసైన్‌మెంట్‌లతో రివార్డ్ చేసే అవకాశం ఉందని తాజా నివేదిక వెల్లడించింది.
అంతర్జాతీయ అనిశ్చితి వాతావరణం మధ్య భారతీయ కంపెనీల సీఈవోలు అనేక అడ్డంకులను, అవరోధాలను ఎదుర్కొంటున్నట్లు కేపీఎంజీ ఇండియా సీఈవో యెజ్డీ నాగ్‌పోరేవాల్లా అన్నారు. జనరేటివ్ ఏఐ అందిపుచ్చుకోవటంలో స్టేక్ హోల్డర్ల అంచనాలను అందుకోలేక పోతున్నారని అన్నారు. గడచిన ఏడాది కాలంగా వృద్ధి పెద్దగా లేదని తాజా నివేదిక వెళ్లడించింది.
ప్రస్తుతం దేశీయ కంపెనీల సీఈవోలు ఎక్కువగా తమ సంస్థల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కలిగి ఉండేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. దాదాపు 58 శాతం మంది తమ సంస్థలలో ఉత్పాదక AIని స్వీకరించడానికి నైతిక సవాళ్లు ఒక ముఖ్యమైన అడ్డంకిగా ఉన్నట్లు చెప్పారు. అయితే 56 శాతం CEOలు అమలు ఖర్చును ప్రధాన అవరోధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications