Kotak Bank: కోటక్ బ్యాంకుకు మరో ఎదురుదెబ్బ.. రాజీనామా చేసిన కీలక వ్యక్తి..
KVS Manian: దేశంలోని అగ్ర ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజంగా కొనసాగుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుతం ఊహించని చిక్కులతో సతమతమౌతోంది. గతవారం రిజర్వు బ్యాంక్ ఐటీ సెక్యూరిటీ విఫలంపై కఠిన చర్యలతో బ్యాంక్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణన్ వెంకట్ సుబ్రహ్మణియన్ రాజీనామా చేశారు. బ్యాంక్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ తక్షణమే అమల్లోకి వచ్చేలా రాజీనామా చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ ప్రకారం వెల్లడైంది. దాదాపు 30 ఏళ్లుగా బ్యాంక్ తో కలిసి పనిచేసిన మణియన్ జనవరిలో మేనేజ్‌మెంట్ రీజిగ్‌లో ఎలివేట్ అయ్యారు. తాను ఫైనాన్స్ రంగంలో ఇతర అవకాశాలను అన్వేషిస్తున్నందున కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు, కంపెనీ బోర్డు నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

మణియన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ వారణాసి పూర్వ విద్యార్థి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, ముంబైలోని జమ్నాలాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి ఆర్థిక నిర్వహణలో పోస్ట్ గ్రాడ్యుయేట్, అలాగే కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ పూర్తి చేశారు. ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంకులోని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ బ్యాంక్ షేర్లపై SELL రేటింగ్ కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. గురువారం మార్కెట్లు తెలుసుకోగానే ఈ ప్రభావం కోటక్ బ్యాంక్ షేర్లపై కనిపించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.1,800గా బ్రోకరేజ్ నిర్ణయించింది.
బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ శాంతి ఏకాంబరం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ & ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీలను పర్యవేక్షిస్తారని, బ్యాంక్ కొత్తగా నియమితులైన MD, CEO అశోక్ వాస్వానీ హోల్‌సేల్, కమర్షియల్ అండ్ ప్రైవేట్ బ్యాంక్‌లను పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది. బ్యాంకుతో కలిసి సుదీర్ఘంగా 29 ఏళ్లు మణియన్ పనిచేయటాన్ని వాస్వానీ ప్రశంశించారు. దీనిపై ప్రముఖ వార్తా సంస్థతో బ్యాంకింగ్ వెటరన్ మాట్లాడుతూ.. రిజర్వు బ్యాంక్ లేవనెత్తిన ప్రశ్నలను లేవనెత్తడంలో కృష్ణన్ వెంకట్ సుబ్రహ్మణియన్ విఫలమయ్యారని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications