20 నిమిషాల్లో శంషాబాద్ విమానాశ్రయానికి.. కోకాపేట నియోపొలిస్ వద్ద కొత్త ట్రంపెట్ జంక్షన్ గురించి తెలుసుకోండి
Kokapet Trumpet Junction in Hyderabad: కోకాపేటలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన నియోపొలిస్ లేఅవుట్‌కు ఓఆర్‌ఆర్‌తో అనుసంధానమయ్యే రహదారి(ట్రంపెట్) ఎట్టకేలకు సిద్ధమైంది. నేడు సీఎం రేవంత్‌రెడ్డి దీనిని ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తదుపరి ప్రారంభోత్సవ తేదీని త్వరలో ప్రకటిస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ ట్రంపెట్ అందుబాటులోకి వస్తే నియోపొలిస్ లేఅవుట్ నుంచి నేరుగా ఔటర్ మీదుగా రాకపోకలు సాగించవచ్చు. ఈ ట్రంపెట్ లైవులోకి వస్తే.. నియోపొలిస్ నుంచి కేవలం 20 నిమిషాల్లోనే విమానాశ్రయానికి చేరుకోవచ్చు.నియోపొలిస్, శంకర్‌పల్లి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఔటర్ రింగ్ రోడ్డు మీదకు నేరుగా చేరుకునేందుకు ఈ జంక్షన్ ఉపయోగపడుతుంది.
గండిపేట మండలంలో ఉన్న కోకాపేటలో ఇటీవలి కాలంలో స్థిరాస్తి రంగంలొ బాగా ఊపు వచ్చింది. హైరైజ్ బిల్డింగ్‌లు వరుసగా నిర్మించబడుతున్న ఈ ప్రాంతంలో నియోపొలిస్ లేఅవుట్ ఏర్పడిన తరువాత మరింతగా రియాల్టీ జోరు పెరిగింది.పలు బిల్డర్ల ప్రాజెక్టులు, కార్పొరేట్ కార్యాలయాలు అక్కడికే తరలిపోతున్నాయి. తాజాగా గతంలో సమస్యగా ఉన్న కనెక్టివిటీని పరిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. HMDA ద్వారా ట్రంపెట్ జంక్షన్ నిర్మాణం చేపట్టింది. నియోపొలిస్ లేఅవుట్ విస్తీర్ణం 500 ఎకరాలకు పైగానే ఉంది. ఈ లేఅవుట్ అభివృద్ధికి రేవంత్ రెడ్డి సర్కారు రూ.450 కోట్లు ఖర్చు పెట్టింది. ఇందులో ట్రంపెట్ జంక్షన్ నిర్మాణానికి రూ. 65 కోట్లు ఖర్చు అయింది.

ఔటర్ రింగ్ రోడ్డును నేరుగా నియోపొలిస్ లేఅవుట్ తో ఈ ట్రంపెట్ అనుసంధానం చేయనుంది. 4 వరుసలతో కూడిన 1.27 కిలోమీటర్ల పొడవైన రహదారిగా ఇది నిలిచింది. అందులో ప్రధాన ట్రంపెట్ స్ట్రెచ్ దాదాపు 600 మీటర్లు వరకు ఉంటుంది, మిగతావి సర్వీస్ రోడ్లుగా ఉంటాయి. ఇది వరకు కోకాపేట నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళాలంటే 45 నిమిషాల నుంచి ఓ గంట వరకు పట్టేది. ఇప్పుడు ఈ ట్రంపెట్ రాకతో కేవలం 20 నిమిషాల్లోనే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ప్రధాన ట్రంపెట్ పొడవు నాలుగు వరుసలు కాగా వెడల్పు 600 మీటర్లు ఉంటుంది. ఔటర్, సర్వీస్ రోడ్లు కలిపితే 1.3 కిలోమీటర్లు ఉంటుంది.
మెహిదీపట్నం - నార్సింగి ప్రధాన రహదారిని ఇంకా వేగంగా చేరుకునేలా 100 అడుగుల వెడల్పుతో రెండు లింక్ రోడ్లు కూడా HMDA ఆప్రొచ్ రోడ్ లా నిర్మించింది. ఇది శంకర్ పల్లి వైపు ఉన్న ప్రధాన రహదారికి కలుపుతుంది. దీనితో కోకాపేట, పుప్పాలగూడ, సూరారం వంటి ప్రాంతాల నుంచి ఔటర్‌పైకి వెళ్లడమే కాకుండా నగరం లోపలికి కూడా త్వరగా చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ లింక్ రోడ్డు ద్వారా ఇటు పటాన్‌చెరు వైపు.. అటు శంషాబాద్ విమానాశ్రయం వైపు ఎటువంటి అంతరాయం లేకుండా సులభంగా రాకపోకలు సాగించవచ్చని HMDA తెలిపింది.


Click it and Unblock the Notifications