TCS Share: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రకంపనలు సృష్టించింది. దీంతో పెట్టుబడిదారులకు సంబంధించిన దాదాపు రూ.4 లక్షల సంపద నేడు ఇంట్రాడేలో ఆవిరైంది. ఈ క్రమంలో టెక్ కంపెనీ టీసీఎస్ మాత్రం లాభాల్లో దూసుకుపోతోంది.
ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచే టీసీఎస్ స్టాక్ లాభాలతో టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతో 52 వారాల గరిష్ఠమైన రూ.3,679 మార్కును చేరుకుంది. మధ్యార్నం 1.44 గంటల సమయంలో 1.25 శాతం లాభంతో రూ.3666.50 రేటు వద్ద ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. దీనికి తోడు ఈవారం కంపెనీ తన రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనుంది. అలాగే రెండవ మధ్యంతర డివిడెండ్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

అక్టోబరు 11న కంపెనీ బోర్డు సమావేశం కానుందని, ఇందులో టీసీఎస్ స్టాక్ బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత ప్రకటన వెలువడింది. గత ఏడాది మార్చిలో సైతం కంపెనీ తన షేర్లను వెనక్కి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఒక్కో షేరుకు రూ.4,500 రేటు చొప్పున చెల్లించి రూ.18,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. అలాగే కంపెనీ 2020, 2018, 2017 సంవత్సరాల్లో సైతం షేర్ బైబ్యాక్ చేసింది.
టీసీఎస్ షేర్ల ప్రయాణాన్ని పరిశీలిస్తే గత సెషన్‌లో స్థాక్ ధర రూ.3,620.20 వద్ద ముగియగా.. సోమవారం రూ.3,654 వద్ద ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడ్‌లో గరిష్టంగా రూ.3,680.00, కనిష్ట స్థాయి రూ.3,631.10కి చేరింది. ఉదయం 10.40 గంటలకు 1.14 శాతం పెరిగి రూ.3658.00 వద్ద ట్రేడవగా..సెన్సెక్స్ 337.54 పాయింట్లు లేదా 0.51 శాతం క్షీణించి 65,658.09 వద్ద ఉంది. TCS మార్కెట్ క్యాప్ రూ.13,40,310.52 కోట్లు కాగా, రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.15,59,556.81 కోట్ల వద్ద ఉంది.


Click it and Unblock the Notifications