Auto Sector on Budget: ప్రపంచ వ్యాప్తంగా రవాణా రంగంలో ప్రభుత్వాలు కీలక మార్పులను తీసుకొస్తున్నాయి. చాలా కాలంగా శిలాజ ఇంధనాలపై ఆధారపడుతున్న ఈ రంగం ప్రస్తుతం గ్రీన్ మెుబిలిటీకి ప్రజలను మూవ్ చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఆటో రంగం కూడా సహకారాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజా బడ్జెట్ ముందు ఆటో సెక్టార్ నుంచి ఆర్థిక మంత్రికి అనేక కీలక వినతులు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే నిర్మలమ్మ ఫిబ్రవరి 1, 2025న బడ్జెట్ ప్రసంగంపై వ్యాపార వర్గాలు ఎప్పటి మాదిరిగా తమకు లభించే ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఇతర బెనిఫిట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం కోరుకున్నట్లుగా వాహన రంగంలో ఈవీలను ప్రోత్సహించటానికి మౌలిక సదుపాయాల బలహీనత పెద్ద అడ్దంకిగా మారింది. దూర ప్రయాణాల కోసం ఎలక్ట్రిక్ కార్లను వినియోగించటానికి ఈ అడ్డంకులు ఉండటం కొనుగోలుదారులను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆటో రంగం నుంచి కీలక వినతులు వినిపిస్తున్నాయి.

గతంలో కేంద్రం ప్రకటించిన పీఎం ఈడ్రైవ్ స్కీమ్ మార్చి 31తో ముగియనుంది. దీని కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక్కో వాహనానికి కిలోవాట్‌కి రూ.5000 సబ్సిడీని అందిస్తోంది. అయితే కొన్ని పరిస్థితుల్లో గరిష్ఠంగా పరిమితి రూ.10 వేలుగా ఉంచబడింది. ఇక్కడ ఈవీల్లో ఆధునిక బ్యాటరీ టెక్నాలజీ ఉపయోగించే సంస్థలకు మాత్రమే అధిక సబ్సిడి అందించబడుతోంది. ఇక టూవీలర్ల విషయంలో గరిష్ఠంగా రూ.10 వేలు తగ్గింపు అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఈవీ స్వీకరణను ప్రోత్సహించటానికి, ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందటానికి ప్రస్తుతం ఉన్న ప్రోత్సాహకాలు సరిపోవని ఆటో రంగం చెబుతోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ పెట్టుబడి అవసరమని దీర్ఘకాలిక పాలసీ స్థిరత్వం అవసరమని ఫోక్స్‌వ్యాగన్ ఇండియా సీఈవో, ఎండీ పియూష్ అరోరా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఈవీల విడిభాగాల జీఎస్టీ సరళీకృతం అవసరమని కోరారు. వాణిజ్య అడ్డంకులను తగ్గించటంతో పాటు నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను సరళీకృతం చేయాలని మెర్సిడీస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ పేర్కొన్నారు. ఆటో రంగంలో ఇండియాను ప్రపంచ సరఫరాదారుగా మార్చటానికి మార్పులు తప్పనిసరన్నారు. అలాగే వ్యాపార వ్యయాలను తగ్గించేందుకు ఏదైనా ప్రభుత్వ చర్యలు మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని సూచించారు.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై కేవలం 5 శాతం జీఎస్టీ పన్ను ఉన్నప్పటికీ అనేక విడి భాగాలపై 15 శాతం నుంచి 28 శాతం వరకు పన్నులు ఉండటంపై డరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎలక్ట్రిక్ వెహికల్ కమిటీ చైర్‌పర్సన్ సుల్జా ఫిరోడియా మోత్వాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీల్లో అన్నింటి కంటే ముఖ్యమైనది బ్యాటరీలు కావటంతో.. బ్యాటరీ రీప్లేస్మెంట్ విషయంలో జీఎస్టీ రేట్లను తగ్గించటం చాలా ముఖ్యమని సూచించారు. ప్రస్తుతం బ్యాటరీ సెల్స్ పై దాదాపు 18 శాతం జీఎస్టీ ఉందని ఆయన అన్నారు.
ఇక పోతే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు అందించే రుణాలను చవకగా మార్చాలని, టైర్-2,3 నగరాల్లో ఈవీ మౌలికసదుపాయాలను మెరుగుపరచటం ద్వారా ప్రజలు దూర ప్రయాణాలకు సైతం ఈవీలు అనువైనవిగా మార్చాలని ఆటో రంగం నుంచి డిమాండ్ వినిపిస్తోంది. భారతీయ ఈవీ రంగం 2030 నాటికి ఈ మార్కెట్ రూ.10,000 కోట్లను అధిగమించి, తయారీ, రిటైల్, అనుబంధ రంగాల్లో 50 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని స్టీల్‌బర్డ్ హెల్మెట్స్ ఎండి, రాజీవ్ కపూర్ అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఈవీల వినియోగం, ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని అన్నారు.


Click it and Unblock the Notifications