Diwali Stocks: దీపావళికి వెలుగులు నింపే టాప్-5 స్టాక్స్.. బ్రోకరేజ్ స్టాక్ షాపింగ్..!!
Stock Picks: పండుగల సీజన్లో ప్రజలు షాపింగ్ చేస్తుంటే ఇన్వెస్టర్లు తమ స్టాక్ షాపింగ్ మెుదలెట్టేస్తున్నారు. అనేక మంది తమ పోర్ట్ ఫోలియోను రానున్న పండుగల సమయంలో రీబ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ కొన్ని షేర్లను పిక్ చేసుకునేందుకు సూచిస్తోంది.
టాటా మోటార్స్..:ముందుగా బ్రోకరేజ్ పండుగలకు ముందర టాటా మోటార్స్ కంపెనీ షేర్లను కొనుగోలు చేయాలని సూచిస్తోంది. కార్ల నుంచి సైన్యం వినియోగించే ట్రక్కుల వరకు కంపెనీ తన ఉత్పత్తులను కలిగి ఉంది. దీనికి తోడు ప్రజలు ఈవీల వైపు మళ్లుతున్న వేళ రానున్న కాలంలో ఆటోమెుబైల్ సేల్స్ వ్యాపారంలో టాటా మోటార్స్ మంచి వాటాను పొందుతుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. రానున్న ఆరు నెలల్లో స్టాక్ 10 శాతం వద్ధి చెందొచ్చని తెలిపింది.

మారుతీ సుజుకీ ఇండియా..:దేశీయంగా కార్ల విక్రయ వ్యాపారంలో మారుతీది అగ్రస్థానం. అనేక దశాబ్ధాలుగా కంపెనీ అనేక మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. ఈ క్రమంలో మధ్యకాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు పండుగల సీజన్ ముందు షేర్లను కొనుగోలు చేయెుచ్చని సూచిస్తోంది. గడచిన ఏడాది కాలంలో స్టాక్ 26 శాతం పెరిగినప్పటికీ రానున్న కాలంలో స్టాక్ ధర దాదాపు 10 శాతం పెరిగే అవకాశం కనిపిస్తున్నట్లు బ్రోకరేజ్ తన అంచనాల్లో వెల్లడించింది.
టైటాన్ కంపెనీ..:పండుగల సీజన్ మెుదలు కావటంతో చాలా మంది ఇప్పటికే తమ షాపింగ్ మెుదలు పెట్టి ఉంటారు. ఈ క్రమంలో జ్యూవెలరీ నుంచి లైఫ్ స్టైల్ వరకు అనేక ఉత్పత్తులను అమ్మే టైటాన్ మంచి రాబడిని పొందనుంది. కంపెనీ తనిష్క్, జోయా, మయా, కార్ట్ లాండ్ వంటి బ్రాండ్ల కింద తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ క్రమంలో ఆరు నెలల కాలంలో స్టాక్ 15-20 శాతం రాబడులను అందిస్తుందని బ్రోకరేజ్ అంచనా వేసింది. గత ఏడాది పండుగల సీజన్లో కంపెనీ షేర్ 14 శాతం మేర లాభపడింది.

ఏషియన్ పెయింట్స్..:దీపావళికి ముందు ఇంటిని శుభ్రపరచడం, పెయింట్ చేయడం వల్ల అదృష్టం లభిస్తాయని చాలా మంది భారతీయులు నమ్ముతారు. అందుకే ఈ సీజన్‌లో పెయింట్‌లు, శుభ్రపరిచే నిత్యావసరాల అమ్మకాలు అనేక రెట్లు పెరగుతాయి. ఈ వ్యాపారంలో సింహభాగం కలిగి ఉన్న పెయింట్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్ స్టాక్స్ కొనుగోలుకు బ్రోకరేజ్ సూచిస్తోంది. మూడు నెలల పెట్టుబడి హోరిజోన్‌తో ఏషియన్ పెయింట్ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు ఐదు నుంచి ఏడు శాతం రాబడిని పొందవచ్చని వెల్లడించింది.
వేదాంత్ ఫ్యాషన్స్..:ఇక చివరగా బ్రోకరేజ్ సంస్థ వేదాంత్ ఫ్యాషన్స్ షేర్లను కొనుగోలు చేసేందుకు అనువైనవిగా సూచించింది. ఈ కంపెనీ మాన్యవర్, మోహే, మెబాజ్, త్వమేవ్, మంథన్ బ్రాండ్ పేర్లతో స్త్రీ పురుషులకు రెడీమేడ్ డ్రెస్ కలెక్షన్ అందిస్తోంది. పండుగలు, వివాహాలు సీజన్లో కంపెనీ మంచి ఆదాయాలను పొందుతోంది. స్వల్పకాలికంలో దాదాపు 10- 12 శాతం రాబడిని పొందడానికి ఇన్వెస్టర్లు షేర్లను పోర్ట్‌ఫోలియోకు జోడించవచ్చని మోతీలాల్ అభిప్రాయపడింది.
NOTE: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీని ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్, పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు నష్టాలతో కూడుకున్నవి కాబట్టి మీ ఆర్థిక సలహాదారుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకోండి.


Click it and Unblock the Notifications