Year Ender 2023: ఫండింగ్ వింటర్‌లోనూ సక్సెస్.. 2023లో నిధులు పొందిన టాప్-10 స్టార్టప్స్..
Year Ender 2023: కరోనా తర్వాత స్టార్టప్ కంపెనీల్లోకి నిధుల ప్రవాహం కొనసాగింది. దీంతో చాలా సంస్థలు విస్తరణ కోసం ఆ సొమ్మును 2022లో వినియోగించాయి. దీంతో ఎక్కువగా డబ్బు ఖర్చుచేయటంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించటంతో నిధులు తగ్గాయి. ఆ తర్వాత ఫండింగ్ వింటర్ ప్రారంభమైంది.
కానీ ఇలాంటి కఠిన సమయాల్లోనూ ఫండింగ్ పొందిన టాప్-10 స్టార్టప్ కంపెనీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ జాబితాలో ఫోన్ పే రూ.7,021 కోట్లను సమీకరించింది. దీంతో ప్రస్తుతం కంపెనీ విలువ 12 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రెండవ స్థానంలో నిలిచిన లెన్స్‌కార్ట్ రూ.5,000 కోట్లను సమీకరించింది. మూడో స్థానంలో నిలిచిన DMI ఫైనాన్స్ రూ.3,300 కోట్ల నిధులను పొందింది. నాలుగో స్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ రూ.3,300 కోట్లను పొందగలిగింది. ఐదో స్థానంలో ఉన్న Builder.ai స్టార్టప్ రూ.2,000 కోట్లను నిధులుగా పొందగలిగింది.

ఆరో స్థానంలో నిలిచిన జెప్టో రూ.1,900 కోట్లను పొందింది. ఏడో స్థానంలో నిలిచిన ఫిన్‌టెక్ స్టార్టప్ పెర్ఫియోస్ రూ.2,500 కోట్లను ఇన్వెస్టర్ల నుంచి పొందింది. ఇక ఎనిమిదో స్థానంలో నిలిచిన ఇన్సూరెన్స్ దేఖో రూ.1,750 కోట్లను, ఎంటర్‌ప్రైజ్ టెక్ స్టార్టప్ Zetwerk రూ.1,000 కోట్లతో తొమ్మిదో స్థానంలో నిలవగా.. పదవ స్థానంలో నిలిచిన మింటిఫై 110 మిలియన్ డాలర్లను పెట్టుబడిదారుల నుంచి పొందగలిగాయి. ఇండియన్ స్టార్టప్ కంపెనీల్లో క్యాష్ బర్నింగ్ చాలా వేగంగా కొనసాగుతోంది. దీనికి తోడు ఫండింగ్ వింటర్ కొనసాగుతున్న నేపథ్యంలో వీటిలో పెట్టుబడులు దాదాపు 72 శాతం క్షీణించాయి.
2023లో భారతీయ స్టార్టప్‌లు మొత్తం 7 బిలియన్ డాలర్ల నిధులను సేకరించాయి. గత ఏడాది ఇది 25 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది అత్యల్ప పెట్టుబడులు డిసెంబర్ త్రైమాసికంలో నమోదయ్యాయని డేటా చెబుతోంది. 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధుల పెట్టుబడి లావాదేవీలు కేవలం 17 మాత్రమే చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఫిన్ టెక్ రంగంలోని స్టార్టప్ కంపెనీలకు సైతం తక్కువ నిధులు రావటం గమనార్హం. 2023లో ఈ కేటగిరీ కంపెనీలు కేవలం 2.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను మాత్రమే అందుకున్నాయి. అలాగే LetsVenture, Accel, Blume Ventures టాప్ ఇన్వెస్టర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications