Stock Market: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఏకంగా సంచలనాలను సృష్టించి కొత్త చరిత్రకు నాంది పలికాయి. సెన్సెక్స్ సూచీ ఏకంగా 80000 మార్కును అధిగమించి బుల్ జోరుతో ఆల్ టైమ్ కొత్త శిఖరాలకు చేరుకుంది. నిఫ్టీ సైతం కొత్త రికార్డుల దిశగా తన పయనాన్ని కొనసాగిస్తున్న వేళ ఇన్వెస్టర్ల చూపు రానున్న వారం మార్కెట్లపై పడింది.
ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అందరి చూపు దేశీయ కార్పొరేట్ కంపెనీల మెుదటి త్రైమాసిక ఫలితాలపైనే ఉంది. ఈ వారం ముందుగా ఐటీ దిగ్గజం టీసీఎస్ ప్రకటనతో జూలై 11న ఫలితాల వెల్లడి మెుదలవుతోంది. దీని తర్వాత ఇతర టెక్ కంపనీలతో పాటు ప్రధాన కంపెనీల ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్నాయి. దీంతో కొన్ని షేర్లలో ర్యాలీ లేదా అమ్మకాలు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని తర్వాత జూలై 12న భారత ప్రభుత్వం వెలువరింటే ద్రవ్యోల్బణం డేటాపై మార్కెట్ ట్రేడర్లు ఒక కన్నేసి ఉంచనున్నారు. అలాగే ఇండస్ట్రియల్ డేటా, బ్యాంక్ లోన్స్ డిపాజిట్స్ డేటా, మ్యానుఫ్యాక్చరింగ్ డేటాను అందరూ పరిగణించనున్నారు.

అలాగే జూలై 9న అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా ఆర్థిక వ్యవస్థ, వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేయనున్నందున మార్కెట్లు కొంత ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ద్రవ్యోల్బణ డేటా సైతం రానున్న వారంలో విడుదల కానుంది. ఇక ప్రపంచ వ్యాపాతంగా చైనా ద్రవ్యోల్బణం, జపాన్, యూరప్ దేశాలకు సంబంధించిన కొన్ని ప్రకటనలు సైతం రానున్నాయి.
ఇక విదేశీ మదుపరుల పెట్టుబడుల వివరాలు, దేశీయంగా కొనసాగుతున్న ఐపీవోల రాకలు, ఇండియా విక్స్ డేటా సైతం ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయాల్లో ఉన్నాయి. అలాగే కంపెనీలు కార్పొరేట్ యాక్షన్ల ద్వారా మెుదటి త్రైమాసిక ఫలితాలతో పాటు తమ ఇన్వెస్టర్లకు బోనస్, డివిడెండ్ వంటివి ప్రకటించనున్న వేళ అది కొన్ని షేర్లకు ప్రయోజనం చేకూర్చవచ్చు. ఇక టెక్నికల్స్ పరిశీలిస్తే రానున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బులిష్ జోరును కొనసాగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీలో 24,400-24,500 స్థాయిల వద్ద బ్రేకౌట్ అంతరాయం రావొచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications