Year Ender 2023: నిఫ్టీ-50లో అదరగొట్టిన 5 కంపెనీలు ఇవే.. 2024 పరిస్థితి ఏంటి..??
Nifty Stocks: 2023 మరో వారం రోజుల్లో ముగియనుంది. వాస్తవానికి ఈ సంవత్సరం దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అత్యంత అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు. సూచీలు తమ కొత్త చారిత్రాత్మక గరిష్ఠాలకు చేరుకుని ఊహించని ర్యాలీని నమోదు చేయటం అనేక మందికి లాభాల పంట పండించింది.
ఏడాది ప్రాతిపదికన ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. 50 షేర్లను కలిగి ఉండే నిఫ్టీ సూచీలోని 5 కంపెనీలు మాత్రం డిసెంబర్ 21, 2023 నాటికి తమ పెట్టుబడితారులకు ర్యాలీలో 50 శాతం లాభాలను అందించాయి. ఈ క్రమంలో విలాసవంతమైన కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR)ని కూడా కలిగి ఉన్న టాటా మోటార్స్ షేర్లు అత్యధికంగా 82 శాతం లాభాలను అందించింది. ప్రస్తుతం స్టాక్ దాదాపు రూ.709 వద్ద ఉన్నప్పటికీ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ షేర్ ఖాన్ కంపెనీకి రూ.840 టార్గెట్ ధరగా ప్రకటించింది.

ర్యాలీలో సూపర్ లాభాలను అందించిన మరో కంపెనీగా ఎన్టీపీసీ నిలిచింది. ఇది ఏడాది ప్రాతిపదికన ఇన్వెస్టర్లకు 81 శాతం రాబడిని అందించింది. ఏడాది కిందట డిసెంబర్ 30న రూ.166.45 వద్ద ఉన్న స్టాక్ ధర ప్రస్తుతం రూ.301.95కి చేరుకుంది. ఇక మూడో స్థానంలో నిలిచిన బజాజ్ ఆటో కంపెనీ స్టాక్ తన ఇన్వెస్టర్లకు 72.74 శాతం రాబడిని అందించింది. ఈ క్రమంలో ఏడాది కాలంలో రూ.3,616.05 నుంచి రూ.6,246.35కి చేరుకుంది. టూవీలర్ దిగ్గజ కంపెనీ షేర్లపై ప్రముఖ బ్రోకరేజ్ కేఆర్ చోక్సీ బులిష్ వ్యూతో షేర్ ధర రానున్న కాలంలో రూ.7,093 మార్కెకు చేరుకుంటుందని పేర్కొంది.
పరుగులతో లాభాలను అందించిన నాలుగో కంపెనీగా ఎల్&టి నిలిచింది. కంపెనీ స్టాక్ గడచిన ఏడాది కాలంలో 64.16 శాతం వృద్ధితో పెట్టుబడిదారులకు సూపర్ రాబడులను అందించింది. ఇక చివరిగా ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా కంపెనీ షేర్లు అత్యధికంగా 57.96 శాతం రాబడిని అందించటంతో టాప్ మల్టీబ్యాగర్ షేర్ల జాబితాలో నిలిచాయి. ఈ క్రమంలో ఎలారా క్యాపిటల్ కోల్ ఇండియా షేర్లకు ఎక్యూమిలేట్ రేటింగ్ అందించింది. రానున్న కాలంలో షేర్ ధర రూ.385ను అందుకుంటుందని తన అంచనాలను వెల్లడించింది.
ఇక 2024 పరిస్థితిని గమనిస్తే.. ఈవీ రంగంలో కొత్త టెక్నాలజీలు వస్తున్నందున స్టాక్ మార్కెట్‌లో పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోని షేర్లు గణనీయమైన పాత్రను పోషిస్తాయని Tradejini సీఓఓ త్రివేష్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications