Success Story: స్లమ్ బాయ్ సక్సెస్ స్టోరీ.. రూ.20,830 కోట్ల సంపదతో దుబాయ్ రిచ్చెస్ట్ ఇండియన్
Rizwan Sajan: మురికి వాడల్లో పుట్టిన వ్యక్తి కోటీశ్వరుడిగా మారటం అనేది సుదీర్ఘమైన జర్నీని సూచిస్తుంది. దీనికి ఊహించని స్థాయిలో బలమైన సంకల్పం చాలా ముఖ్యం. ముంబై మురికి వాడల్లో వీధి వ్యాపారిగా ప్రయాణం మెుదలుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం దుబాయ్‌లో అతిపెద్ద కోటీశ్వరుడుగా ఎదిగిన సక్సెస్ స్టోరీ నేటి యువతరానికి నిజంగా స్పూరిదాయకం. విజయం సాధించటానికి అకుంటిత దీక్ష చాలా ముఖ్యమని ఈ సక్సెస్ స్టోరీ నిరూపిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రిజ్వాన్ సజన్ సక్సెస్ స్టోరీ గురించే. రిజ్వాన్ ముంబైలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. సజన్ చిన్న వయస్సులో 16వ ఏట తండ్రిని కోల్పోయాడు. ఈ క్రమంలో కుటుంబ పోషనకోసం పాల పంపిణీ నుంచి పుస్తకాలు అమ్మటం వరకు అనేక చిన్నచిన్న ఉద్యోగాలు చేశాడు. పేదరికం కారణంగా 1981లో రిజ్వాన్ సజన్ మంచి అవకాశాల కోసం కువైట్‌కు బయలుదేరి వెళ్లాడు. అక్కడ తన మేనమామ బిల్డింగ్ మెటీరియల్స్ స్టోర్‌లో సేల్స్‌మెన్‌గా కెరీర్ ప్రారంభించాడు. పట్టుదలతో పనిలో ఉన్న సమయంలో మెళకువలు నేర్చుకున్నాడు. ఈ క్రమంలో అతని కెరీర్‌ను పెద్ద మలుపుతిప్పిన కారణం 1991లో జరిగిన గల్ఫ్ వార్. ఆ సమయంలో రిజ్వాన్ తిరిగి ముంబైకి రావటంతో విజయం ఆలస్యం అయ్యింది.

దీని తర్వాత ఎదురైన అనేక అడ్డకులను ఎదుర్కొని సజన్ తన సొంత లక్ష్యాలను సాధించాలని నిర్ణయించుకున్నాడు. అలా 1993లో డాన్యూబ్ గ్రూప్ ను చిన్న వ్యాపారంగా ప్రారంభించాడు. అచంచలమైన సంకల్పంతో చిన్న కంపెనీని UAEలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా మార్చాడు. 2019లో డాన్యూబ్ గ్రూప్ మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఆ తర్వాత 1.3 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని నమోదు చేసింది. సజన్ నేతృత్వంలో డాన్యూబ్ గ్రూప్ నిర్మాణ సామగ్రి మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్, గృహోపకరణాలు సహా ఇతర రంగాలలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి మిడిల్ ఈస్ట్‌లోని మార్కెట్‌లలోనూ ప్రసిద్ధి చెందింది.

మారుతున్న మార్కెట్‌కు అనుగుణంగా సజన్ తన నైపుణ్యాలు, అంతర్దృష్టులను వైవిధ్యపరచడం ప్రారంభించాడు. తద్వారా సజన్ వ్యాపారం బాగా అభివృద్ధి చెంది, లాభదాయకంగా ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సజన్ నికర విలువ 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు దుబాయ్‌లోని అత్యంత ధనవంతుల్లో ఒకడిగా ఎదిగాడు. భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం అతని సంపద విలువ దాదాపు రూ.20,830 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. అలనాడు ఎన్టీఆర్ చెప్పినట్లుగా కృషి ఉంటే మనుషులు బుుషులవుతారని సజన్ తన సంకల్ప దీక్షతో వ్యాపారంలో నిరూపించాడు.


Click it and Unblock the Notifications