Success Story: రూ.5,000 అప్పుతో మెుదలైన ప్రయాణం.. కోట్లకు పడగలెత్తిన వ్యాపారి..
Success Story: ప్రస్తుతం వ్యాపార రంగంలో వేల కోట్లకు అధినేతలుగా మారిన వారందరి జీవితాల్లో చాలా కృషి ఉంది. ప్రజలకు అవగాహన లేని, రుణాలు పొందటం కష్టతరంగా, మీడియా విస్తృతంగా ప్రజలకు చేరువకాని రోజుల్లో వారు తమ వ్యాపార కలలను ప్రారంభించి విజయం సాధించారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జ్యోతి ల్యాబ్స్ కంపెనీ గురించి. మనలో చాలా మందికి పరిచయం ఉన్న ఉత్పత్తులు ఉజాలా బ్లూ, మాక్సో మస్కిటో రిపెల్లెంట్. వీటిని తయారు చేసే సంస్థ జ్యోతి ల్యాబొరేటరీస్. కంపెనీని కేరళకు చెందిన మూతేడత్ పంజన్ రామచంద్రన్ స్థాపించారు. రామచంద్రన్ కేరళలోని త్రిస్సూర్‌లోని సెయింట్ థామస్ కాలేజీలో బికామ్ డిగ్రీ పూర్తి చేశారు. కేవలం రూ.5,000 రుణంతో వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన సక్సెస్ స్టోరీ ప్రస్తుతం మిలియన్ల మంది యువ పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా ఉంది.

తన వ్యాపార చతురతతో తాత్కాలిక కర్మాగారం ఏర్పాటు నుంచి ప్రస్తుతం కంపెనీ విలువను రూ.13,583 కోట్లకు తీసుకెళ్లారు. రామచంద్రన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అకౌంటెంట్‌గా పనిచేస్తున్నప్పటికీ.. ఆయన ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవటం, విభిన్నమైన ఉత్పత్తులను తయారు చేయటం వంటి వ్యాపార ఆలోచనలపై ఆసక్తిగా ఉండేవారు. అలా పుట్టిందే బట్టల కోసం వైట్‌నర్ తయారు చేయాలనే ఆలోచన. దీనికోసం ఇంట్లోని వంటగదిలో ప్రయోగాలు చేయటం ప్రారంభించారు రామచంద్రన్.
ఒక రోజు రామచంద్రన్‌కి ఒక రసాయన పరిశ్రమ పత్రిక కనిపించింది. వస్త్ర తయారీదారులు వీలైనంత తెల్లగా, ప్రకాశవంతమైన రంగులను సాధించడంలో సహాయపడటానికి ఊదా రంగులను ఉపయోగించవచ్చని అందులో ఉండటం గమనించారు. అలా తన ప్రయోగాలు కొనసాగించి ఉజాలా సుప్రీం లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్‌నర్ తయారు చేశాడు. దీంతో తన కుమార్తె జ్యోతి పేరుపై 1983లో కేరళలోని త్రిస్సూర్‌లో కుటుంబానికి చెందిన కొద్దిపాటి భూమిలో తాత్కాలిక కర్మాగారాన్ని ఏర్పాటు చేశాడు. అలా తన వ్యాపార ప్రయాణాన్ని విజయవతంగా ప్రజాధరణతో ముందుకు కొనసాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications