Success Story: డెలాయిజ్ జాబ్ వదిలేసి.. రూ.3.5 లక్షలతో రూ.300 కోట్ల కంపెనీ నిర్మించి సక్సెస్..
Nidhi Yadav Story: నేటితరం యువత ఉద్యోగం వద్దు నచ్చిన బిజినెస్ చేయటమే ముద్దు అంటూ ముందుకు సాగిపోతున్నారు. ఈ క్రమంలో స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను సైతం అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. లక్షల్లో వేతనాలు వస్తున్నా వాటిని మానుకుని కోట్ల రూపాయలు విలువైన కంపెనీలను తీర్చిదిద్దేందుకు ముందుకు వస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నిధి యాదవ్ సక్సెస్ స్టోరీ గురించే. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన నిధి డెలాయిట్ కంపెనీలో తన ఉద్యోగాన్ని మానుకుని తనకు నచ్చిన వ్యాపారాన్ని ప్రారంభించాలని భావించింది. ఈ క్రమంలో 2014లో ఒక చిన్న రెండు గదెల ఇంటి నుంచి కేవలం రూ.3.5 లక్షల పెట్టుడితో ఫ్యాషన్ రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఫ్యాషన్ రంగంపై ఉన్న మక్కువతో ఇటలీలోని ఫ్లోరెన్స్‌లోని పోలిమోడ ఫ్యాషన్ స్కూల్‌లో ఒక సంవత్సరం కోర్సు కూడా చేసింది. దీని తర్వాత ఇండియాకు వచ్చి 18-35 ఏళ్ల మధ్య వయస్సు మహిళలకు సరసరమైన ధరలకు బ్రాండెడ్ దుస్తులను అందించేందుకు కంపెనీని ప్రారంభించింది. దీనికోసం అనేక ఐకానిక్ ఫ్యాషన్ బ్రాండ్ల బిజినెస్ మోడల్ గురించి కూడా పరిశోధించి తెలుసుకుంది.

"ది డెవిల్ వేర్స్ ప్రాడా" చిత్రం ద్వారా ప్రేరణ పొందిన ఆమె ఫ్యాషన్‌లో వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకుంది. వెంటనే నిధి వ్యాపారం విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ పట్టువదలకుండా ముందుకు సాగటంతో ఐదేళ్లలో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. వ్యాపారం ప్రారంభమైన మరుసటి ఏడాది కంపెనీ ఆదాయం రూ.8.50 కోట్లుగా నమోదైంది. అలా 2019-20 సంవత్సరంలో రూ.100 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ.300 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం నిధి ఆస్క్ క్లోతింగ్ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
కాంటెంపరరీ ఎత్నిక్ వేర్‌పై దృష్టి సారించిన కంపెనీ తన సొంత వెబ్ సైట్ తో పాటు మార్కెట్లోని ఈకామర్స్ దిగ్గజాలైన మింట్రా, అజియో, నైకా, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను వేగంగా కస్టమర్లకు చేరుకునేందుకు వినియోగించుకుంది. దీంతో 2023లో ఆస్క్ క్లోతింగ్ కంపెనీ వార్షిక ఆదాయం రూ.86 కోట్లకు చేరుకుంది. ఫాషోర్, రంగృతి, డ్రెస్‌ఫోక్ వంటి బ్రాండ్‌ల లాంటి బ్రాండ్ల నుంచి పోటీ ఉన్నప్పటికీ కంపెనీ వేగంగా ముందుకు సాగుతోంది. వేగవంతమైన సరఫరా, న్యూ డిజైన్స్, నాణ్యతపై రాజీలేని ప్రయాణం కంపెనీని విజయం సాధించటానికి దోహదపడ్డాయి. విస్తృత కస్టమర్ బేస్ కలిగి ఉన్న కంపెనీని రూ.500 కోట్ల బ్రాండ్‌గా తీర్చిదిద్దాలని నిధి లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కంపెనీకి సత్పాల్ యాదవ్, యష్దత్ యాదవ్, నిధి యాదవ్ సహ వ్యవస్థాపకులుగా కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications