Success Story: మానవ జీవితంలో అన్నింటి కంటే కష్టమైనది పేదరికాన్ని అనుభవించటం. చిన్నతనంలో, యవ్వనంలో వచ్చే పేదరికం చాలా మందిని కష్టాల పాలు చేస్తుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమ జీవితంలో దీనిని అధిగమించి ముందుకు సాగుతుంటారు.
అలా విజయతీరాలను తాకిన వారిలో రఘునందన్ కూడా ఒకరు. వ్యాపార రంగంలో ఆయన మెుదటి తరం వ్యక్తి. ఒక బ్రాండ్ నిర్మించటం, దానిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లటం ఎంత కష్టమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా పేదరికం నుంచి బయటపడి రూ.300 కోట్ల విలువైన వ్యాపారాన్ని రఘునందన్ శ్రీనివాస్ కామత్ సృష్టించారు. 1984లో ముంబై కేంద్రంగా నేచురల్ ఐస్ క్రీం తయారీని ప్రారంభించి విజయం సాధించారు. రఘునందన్ తన జీవితంలో ఎక్కువ భాగం నేచురల్ ఐస్ క్రీం బ్రాండ్, దాని వ్యాపార విస్తరణలో గడిపారు.

ప్రస్తుతం కంపెనీ ముంబైలోనే కాకుండా బెంగళూరు, గోవా, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ లలో తన ఐస్ క్రీం వ్యాపారంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 1954లో కర్ణాటక, మంగళూరు సమీపంలోని ముల్కి అనే చిన్న గ్రామంలో కామత్ జన్మించారు. రఘునందన్ తండ్రి పండ్ల వ్యాపారి. అతనికి ఏడుగురు పిల్లలుండగా వారిలో రఘునందన్ చిన్నవాడు. 7 మంది పిల్లలను పెంచడానికి తగినంత డబ్బు లేకపోవడంతో, రఘునందన్ తన సోదరుడితో కలిసి పావ్‌బాజీ అమ్మే పని కోసం 15 ఏళ్ల వయస్సులో ముంబైకి వెళ్లాడు.
రఘునందన్ తన సోదరుడి రెస్టారెంట్‌లో పనిచేస్తున్నప్పుడు పండ్లతో ఐస్‌క్రీం తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత తన సొంత ఐస్ క్రీం పార్లర్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. 1984లో ముంబైలోని జుహు ప్రాంతంలో 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఐస్‌క్రీం పార్లర్‌ను ప్రారంభించి కొత్త రుచుల్లో ఐస్‌క్రీం విక్రయించాడు. అప్పుడు కేవలం 4-8 ఫ్లేవర్లతో ప్రారంభమైన ఐస్‌క్రీమ్ వ్యాపారం ఇప్పుడు 125 ఫ్లేవర్లలో అందుబాటులోకి వచ్చి నేచురల్ ఐస్ క్రీమ్ ప్రీమియం బ్రాండ్‌గా 135 నగరాలకు విస్తరించింది. ప్రస్తుతం కంపెనీ వార్షిక ఆదాయం రూ.400- 500 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications