Success Story: MRF నిరాడంబర సక్సెస్ స్టోరీ.. కస్టమర్ల మదిలో చెరగని ముద్ర..
MRF Story: ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఎమ్ఆర్ఎఫ్ టైర్స్ కంపెనీ సక్సెస్ అకస్మాత్తుగా రాలేదు. స్వాతంత్య్రానికి ముందరే ప్రారంభించబడిన సంస్థ భారతీయుల మదిని చూరగొంది.
1946లో నిరాడంబరంగా ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రముఖ టైర్ల తయారీదారు MRF లిమిటెడ్. కంపెనీ ప్రయాణం నాణ్యత, ఆవిష్కరణ, కస్టమర్ సంతృప్తి పట్ల దాని నిబద్ధతకు నిదర్శనం. ప్రస్తుతం MRF ఆటోమోటివ్ పరిశ్రమలో శ్రేష్ఠతకు చిహ్నంగా నిలుస్తోంది. దీనిని KM మమ్మెన్ మాప్పిళ్లై 1946లో మద్రాస్‌లోని తిరువొత్తియూర్‌లో(ప్రస్తుతం చెన్నై) బొమ్మల బెలూన్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటుతో పునాది వేశారు.

1949 నాటికి కంపెనీ రబ్బరు బొమ్మలు, గ్లౌజులు, గర్భనిరోధకాలు వంటి ఉత్పత్తులకు విస్తరించింది. తొలుత కంపెనీ కార్యాలయం మద్రాసులోని తంబు చెట్టి వీధిలోని 334లో ఉండేది. ఆ తర్వాత 1952లో కంపెనీ ట్రెడ్ రబ్బరు ఉత్పత్తి తయారీలోకి అడుగుపెట్టింది. ఇది కంపెనీ చరిత్రలో జరిగిన అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కంపెనీ టైర్ల తయారీ రంగంలో దేశంలోనే అగ్ర శ్రేణికి చేరుకుంది. కేవలం నాలుగేళ్లలో కంపెనీ ట్రెడ్ రబ్బర్‌లో మార్కెట్ లీడర్‌గా మారింది. అలా 50% మార్కెట్ వాటాను ఆకట్టుకుంది.
ఈ ప్రయాణంలో కంపెనీ 1961లో అనేక విజయాలను సాధించింది. కంపెనీ పబ్లిక్‌గా మారింది. యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన మాన్స్‌ఫీల్డ్ టైర్ & రబ్బర్ కంపెనీతో సాంకేతిక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. 1964లో లెబనాన్‌లోని బీరుట్‌లో అంతర్జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా దాని ప్రపంచ ప్రభావాన్ని విస్తరించింది. టైర్లను ఎగుమతి చేయడానికి, ప్రత్యేక గుర్తింపును స్థాపించడానికి భారతదేశం చేసిన మొదటి ప్రయత్నాల్లో ఇది ఒకటి. 1973లో నైలాన్ ప్యాసింజర్ కార్ టైర్లను వాణిజ్యపరంగా తయారు చేసి విక్రయించిన మొదటి భారతీయ కంపెనీగా నిలిచింది.
కంపెనీ 2007లో ఏకంగా ఒక బిలియన్ డాలర్ల వ్యాపార టర్నోవర్ మార్కుకు చేరుకుంది. ఆ తర్వాత 2011లో రెండు బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలా స్థిరమైన పనితీరుతో కంపెనీ షేర్లు 2012 ఫిబ్రవరి నాటికి రూ.10,000 మార్కును అధిగమించాయి. తాజాగా నేడు స్టాక్ ధర ఏకంగా రూ.లక్షను దాటి చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించింది. మార్కెట్ల ప్రతికూలతల్లోనూ స్టాక్ ర్యాలీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పైగా ఈ రికార్డు సృష్టించిన తొలి భారతీయ కంపెనీ కూడా ఎమ్ఆర్ఎఫ్ కావటం విశేషం.


Click it and Unblock the Notifications