Success Story: అమెరికా వదిలి బెజవాడకు.. రూ.200 కోట్ల వ్యాపారం సక్సెస్ స్టోరీ..
MIVI Success Story: అమెరికాలో సక్సెస్ ఫుల్ జాబ్స్ వదిలేసి ఇండియాకు తిరిగి రావాలని చాలా మంది అస్సలు చేయని ఆలోచన. వాస్తవానికి చాలా మంది అసలు యూఎస్ వెళ్లి జాబ్ చేయాలి, అక్కడే స్థిరపడాలని డ్రీమ్స్ లో ఉంటుంటారు. అయితే వీటికి విరుద్దంగా ఏపీకి చెందిన విశ్వనాధ్ కందుల, మిధుల దేవభక్తుని యూఎస్ నుంచి విజయవాడకు తిరిగి వచ్చి వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
వాస్తవానికి విశ్వనాధ్ కందుల, మిధులా దేవభక్తుని తొలుత యుఎస్‌లోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నప్పుడు కలుసుకున్నారు. అక్కడ తమ కోర్సులను పూర్తి చేసిన తర్వాత విశ్వనాధ్ ఇండియాకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఎగుమతి చేసే ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఇదే క్రమంలో మిధులా జిరాక్స్ కంపెనీలో ఉద్యోగం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇండియాలో నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరలకు అందుబాటులో లేవని గ్రహించాడు విశ్వనాధ్. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని దేశీయంగా సొంత కంపెనీని ఏర్పాటు చేసి నాణ్యమైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయించాలనే ఆలోచనకు వచ్చాడు.

అలా అమెరికాలో 8 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ జంట విజయవాడకు తిరిగి వచ్చింది. 2015లో తమ ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు సెమినోల్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని ప్రారంభించారు. అలా 'Mivi' బ్రాండ్ పేరుతో నాణ్యమైన ఉత్పత్తులను అందించటం ప్రారంభించారు. ఈ కంపెనీ కేబుల్స్, ఛార్జర్‌లు, కస్టమ్ డిజైనర్ కేసులు, టెంపర్డ్ గ్లాస్, పవర్ బ్యాంక్‌లు, కార్ యాక్సిసరీస్, ఇయర్‌ఫోన్స్, హెడ్‌ఫోన్‌ల వంటి ఆడియో ఉత్పత్తులను విక్రయించటం ప్రారంభించింది. కంపెనీ ఈ క్రమంలో 17-35 ఏళ్ల వయస్సు మధ్య వయస్సు ఉన్న కస్టమర్లను టార్గెట్ చేస్తూ ఉత్పత్తులను డిజైన్ చేయటం ప్రారంభించింది. కంపెనీకి మెజారిటీ కస్టమర్లు టైర్ 1 నగరాలకు చెందినవారే.
కంపెనీ ప్రధానంగా కస్టమర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వాటిని పరిష్కరిస్తూ ఉత్పత్తులను తీసుకురావటం కారణంగా యువత నుంచి మంచి డిమాండ్ చూస్తోంది. భారతీయ మార్కెట్లో విక్రయించే యూరోపియన్ ఛార్జర్‌లు ఎలక్ట్రిక్ కరెంట్, వోల్టేజ్ హెచ్చుతగ్గుల మార్పును తట్టుకోలేక పాడైపోవటాన్ని తాము గమనించినట్లు మిధులా పేర్కొన్నారు. అందువల్ల ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా BIS-సర్టిఫైడ్ ఛార్జర్‌లు వోల్టేజ్ హెచ్చుతగ్గులను తట్టుకుని పరికరాలను రక్షించేలా తయారు చేయబడ్డాయి. అయితే తమ ప్రయాణాన్ని తొలుత రూ.3 కోట్లతో ప్రారంభించిన కంపెనీ కేవలం మూడేళ్ల కాలంలో రూ.30 కోట్ల టర్నోవర్ స్థాయికి చేరుకుంది.
2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.150 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఏడాది కంటే దాదాపు 140 శాతం అధికం. 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ రెవెన్యూ రూ.400 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. Miviకి ప్రస్తుతం హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఇయర్‌ఫోన్‌లు, స్పీకర్లు, సౌండ్‌బార్లు, గేమింగ్ ఉపకరణాలు వంటి ఆడియో ఉత్పత్తులను తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. కంపెనీ తెలంగాణలో రెండవ తయారీ కేంద్రాన్ని కూడా ఇప్పటికే నిర్మిస్తోంది. కొత్త యూనిట్ మార్చి 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. కంపెనీ భవిష్యత్తు వ్యాపార విస్తరణ ప్రక్రియలో భాగంగా స్మార్ట్ వాచ్‌ల ఉత్పత్తి వ్యాపారంతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్స్ ఏర్పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.


Click it and Unblock the Notifications