Women's Day 2025: ప్రపంచంలో ఏ దేశాన్ని చూసినా అది విజయవంతంగా పురోభివృద్ధిని సాధించటంలో మహిళల పాత్ర కీలకంగా ఉందని అర్థమవుతోంది. మహిళలు కేవలం వంట గదికి మాత్రమే పరిమితం కావాలనే పాతకాలం పరిస్థితులు ప్రస్తుతం లేవు. మహిళలు అన్ని రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం.
అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రస్తుతం మహిళలు రాజకీయ రంగం నుంచి వ్యాపార రంగం వరకు విద్య నుంచి వైద్యం వరకు ఇందుగలరు అందులేరు అన్నట్లుగా శ్రామికశక్తిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుత కాలంలో మహిళలు మారిన పరిస్థితులతో ఇంట్లో తల్లిగా, భార్యగా మాత్రమే కాకుండా సమాజంలో ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా, రాజకీయ ప్రతినిధులుగా, ఉపాధ్యాయులు, లాయర్లుగా, వైద్యులుగా ఇలా అనేక పాత్రలను ఏకకాలంలో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆర్థిక వ్యవస్థలను ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారవేత్తలుగా సున్నా నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి సక్సెస్ సాధించిన కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతి రెడ్డి..
ప్రస్తుతం జ్యోతిరెడ్డి అమెరికాలో బిలియన్ డాలర్ల విలువైన సంస్థ 'కీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్'ను విజయవంతంగా స్థాపించి దానిని ముందుకు నడిపిస్తున్నారు. ఒకప్పుడు భారతదేశంలో రోజుకు రూ.5కు వ్యవసాయ కూలీగా పనిచేసిన ఆమె తర్వాతి కాలంలో కేంద్ర ప్రభుత్వ పథకం కింద టీచింగ్ ఉద్యోగం సంపాదించారు. 18 ఏళ్ల వయస్సులో ఇద్దరు పిల్లలతో పేదరికంలో ఉన్న ఆమె ఉద్యోగంతో పాటు టైలరింగ్ పనిచేస్తూ తన కలలను నిజం చేసుకునేందుకు ముందుకు నడిచారు. 'రిక్రూట్‌మెంట్ ప్రొఫెషనల్'గా చిన్న ఉద్యోగంతో స్టార్ట్ చేసిన సొంతంగా సంస్థను ఏర్పాటు చేసి 15 మిలియన్ డాలర్ల టర్నోవర్ మార్కును సాధించి అనేక మంది మహిళలకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
మిధులా దేవభక్తుని..
అమెరికాలో చదువు పూర్తయ్యాక విజయవంతంగా జెరాక్స్ సంస్థలో ఉద్యోగం సంపాదించిన విజవాడకు చెందిన మహిళ మిధులా దేవభక్తుని. ఆమె మంచి ఆదాయాన్ని పొందుతున్నప్పటికీ తన భర్త విశ్వనాథ్ కందులతో కలిసి ఇండియాలో నాణ్యమైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఉన్న గ్యాప్ గమనించారు. 2015లో తమ ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు సెమినోల్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని ప్రారంభించారు. దీనికింద 'Mivi' బ్రాండ్ పేరుతో నాణ్యమైన కేబుల్స్, ఛార్జర్‌లు, కస్టమ్ డిజైనర్ కేసులు, టెంపర్డ్ గ్లాస్, పవర్ బ్యాంక్‌లు, కార్ యాక్సిసరీస్, ఇయర్‌ఫోన్స్, హెడ్‌ఫోన్‌ల వంటి ఆడియో ఉత్పత్తులను విక్రయిస్తూ విజయాన్ని సాధించారు.


Click it and Unblock the Notifications