Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
Irfan Razack Success: చాలా మందికి సంపన్నులుగా మారాలనే కోరిక బలీయంగా ఉంటుంది. అయితే ఇందుకు కుబేరుల ఇంటిలోనే పుట్టాల్సిన అవసరం లేదని చాలా మంది తమ సక్సెస్ స్టోరీల ద్వారా నిరూపించారు. ప్రస్థానం ఎక్కడ మెుదలైంది అనే విషయం కంటే ఎక్కడ ముగిసిందనేదే ముఖ్యమని పెద్దలు చెబుతుంటారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వ్యాపారవేత్త ఇర్ఫాన్ రజాక్ విజయం గురించే. టైలర్ షాప్ నిర్వహించే ఓ వ్యక్తి కుటుంబంలో పుట్టి సాధారణ ప్రయాణంతో మెుదలై దేశంలోని రియల్ ఎస్టేట్ పరిశ్రమలో గుర్తింపు పొందిన వ్యాపారవేత్తగా ఆయన ఎదిగారు. బిలియనీర్ల జాబితాలో చేరిన ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ఇర్ఫాన్ రజాక్ సక్సెస్ నిజంగా స్పూర్తిదాయకం. ఇర్ఫాన్ తండ్రి రజాక్ చత్తర్ 1950లో బెంగళూరులో చిన్న టైలరింగ్ దుకాణాన్ని నడిపేవారు. తర్వాతి కాలంలో క్రమంగా ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. దీనినే పెద్ద వ్యాపారంగా మార్చేశారు ఇర్ఫాన్ రజాక్.

ఇర్ఫాన్ రజాక్ నేతృత్వంలో ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్ భారతదేశంలో రెండవ అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీగా అవతరించింది. నివాసాలు, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు వంటి వివిధ నిర్మాణ ప్రాజెక్టులను కంపెనీ చేపట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కంపెనీ 54 ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. DLF తర్వాత.. ప్రెస్టీజ్ కంపెనీ ఆపిల్, లూయిస్ విట్టన్, క్యాటర్‌పిల్లర్ వంటి ప్రపంచ బ్రాండ్‌లకు స్థలాన్ని లీజుకు ఇచ్చింది. కంపెనీ వ్యాపారం చెన్నై, కొచ్చి, హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు విస్తరించింది. కంపెనీ కస్టమర్లు ఎక్కువగా మధ్యతరగతి వారు కావటం విశేషం.
70 ఏళ్ల వయసులోనూ రజాక్ ఉత్సాహం తగ్గకుండా వ్యాపారంలో యాక్టివ్‌గా ఉన్నారు. 2014లో ఫోర్బ్స్ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో 77వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆయన నికర విలువ దాదాపు 1.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రెస్టీజ్‌తో పాటు రజాక్ ఇండచర్ అకాడమీని కూడా స్థాపించారు. ప్రెస్టీజ్ ఎస్టేట్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.48,214 కోట్లుగా ఉంది. 2023లో కంపెనీ రూ.1,067 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీలో ప్రమోటర్లకు 65.48 శాతం వాటా ఉండగా విదేశీ ఇన్వెస్టర్లు 18.7 శాతం వాటాను, రిటైల్ ఇన్వెస్టర్లు 4 శాతం వాటాలను హోల్డ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications