కేవలం రూ.5 లక్షలతో.. రూ.2,200 కోట్లు సంపాదన..! సూపర్ ఇన్వెస్టర్ సక్సెస్
Anil Goyal: స్టాక్ మార్కెట్లలో సక్సెస్ కావటం అనేది చెప్పుకున్నంత సులువు కాదు. అయితే కేవలం రూ.5 లక్షల పెట్టుబడితో వేల కోట్లు సంపాదించిన సూపర్ ఇన్వెస్టర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అనిల్ కుమార్ గోయల్ గురించే. ఆయన తన 41వ ఏట స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించారు. ఉక్కు వ్యాపార కుటుంబానికి చెందిన గోయల్ కేవలం రూ.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో కోట్లకు పడగలెత్తారు. ప్రస్తుతం ఈయన వయస్సు 71 ఏళ్లు. ఆయన పేరు చెన్నై ఇన్వెస్ట్‌మెంట్ క్లబ్‌లో చేర్చబడింది. తన తాత నుంచి 16 ఏళ్ల వయస్సులో వస్తువుల కొనుగోలు, విక్రయంలో మెళకువలు నేర్చుకున్నారు.

సెప్టెంబర్ 30, 2023 నాటికి అనిల్ గోయల్ మెుత్తం పెట్టుబడుల విలువ దాదాపు రూ.2,117.5 కోట్లుగా ఉంది. గోయల్ ఎల్లప్పుడూ దీర్ఘకాలిక పెట్టుబడులను నమ్ముతారు. లాభాలు స్వీకరించాలంటే తప్పకుండా వేచి ఉండే ఓపిక ఇన్వెస్టర్లకు అత్యవసరమైనదని అన్నారు. ఈ క్రమంలో గోయల్ పెట్టుబడి పెట్టేటప్పుడు షేర్ల ధరలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తక్కువ ధరకు ఏదైనా కొన్నప్పుడు అందులో ఎలాంటి ప్రమాదం ఉండదని భావిస్తుంటారు. వృద్ధి లేకుండా కంపెనీలు డివిడెండ్‌లను నిరంతరం పెంచలేవని గోయల్ అభిప్రాయపడ్డారు.
పెట్టుబడుల విషయంలో అత్యంత ముఖ్యమైనది కంపెనీల పనితీరును పోల్చి చూడటం. దీనివల్ల ఏ కంపెనీ షేర్లను కొనుగోలు చేయాలి, ఏ రేటు వద్ద విక్రయించవచ్చు వంటి అంశాలపై అవగాహన వస్తుంది. దీనినే అనిల్ గోయల్ కూడా ఫాలో అవుతుంటారు. ఈ మెుత్తం ప్రక్రియలో పెట్టుబడి నిర్ణయాలను సొంతంగా తీసుకోవాలని అందుకోసం అవసరమైన పరిశోధన ముందుగా చేయాలని ఆయన అంటుంటారు. ఇతరు ఇచ్చే సలహాలతో మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం కాదని ఆయన అభిప్రాయం.

చాలా మంది తెలివైన పెద్ద ఆటగాళ్ల మాదిరిగానే స్టాక్ మార్కెట్ల పతనంతో భయపడకుండా కొత్త పెట్టుబడి అవకాశాలను గోయల్ అన్వేషిస్తుంటారు. 2008లో స్టాక్ మార్కెట్ల క్రాష్ సమయంలోనూ నష్టాలతో భయపడకుండా కొత్త పెట్టుబడులను తన పోర్ట్ ఫోలియోలోకి చేర్చి అద్భుతమైన లాభాలను అనిల్ గోయల్ అందుకున్నారు. అనిల్ గోయల్ సాధారణంగా తన పెట్టుబడి వ్యూహాన్ని వెల్లడిస్తూనే ఉంటారు. వాల్యుయేషన్ తెలియకుండా హాట్ సెక్టార్‌లలో డబ్బు పెట్టుబడి పెట్టడం మూర్ఖత్వం. మార్కెట్లపై తగిన అవగాహన పొందిన తర్వాతే ఇన్వెస్ట్ చేయటం ఉత్తమం.


Click it and Unblock the Notifications