Barosi Durlab Rawat: ఈ రోజుల్లో చాలా మంది ఒకరి కింద ఉద్యోగం చేయటాన్ని భావిసత్వంగా పరిగణిస్తున్నారు. తక్కువ సంపాదించినా తమకు నచ్చిన పని చేసేందుకు నేటి యువత ఆసక్తి చూపుతున్నారు. అలా కార్పొరేట్ ఉద్యోగం వీడి కోటీశ్వరుడిగా మారిన యువ వ్యాపారి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనసుకు నచ్చిన వ్యాపారంతో సక్సెస్ సాధించిన తర్లాబ్ రావత్ ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో జన్మించాడు. ఆయన కుటుంబం సాంప్రదాయకంగా వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. అనేక సవాళ్లు, పేదరికం మధ్య దర్లాబ్ రావత్ దిల్లీ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లమా పూర్తి చేశాడు. అలా ఆటో మెుబైల్ తయారీ పరిశ్రమలో రూ.6 వేల జీతానికి ఉద్యోగాన్ని ప్రారంభించాడు. 12 ఏళ్లలో ఎదిగి రూ.15 లక్షల జీతాన్ని పొందాడు. అయితే ఇవేవీ అతడికి సంతోషాన్ని ఇవ్వలేదు. సొంత వ్యాపారం నెలకొల్పాలనే తన డ్రీమ్ వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగాడు.

ఒకరోజు అకస్మాత్తుగా ఉద్యోగం మానేసి స్వగ్రామానికి తిరిగి వచ్చి ఇంట్లో వాళ్లను ఒప్పించి ఆవుల పెంపకం మెుదలు పెట్టాడు. అలా పాలు, పాల ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించాడు. చిన్నతనంలో తల్లి కట్టెలపొయ్యపై మట్టి కుండలో పాలు మరిగించిన జ్ఞాపకాలతో కంపెనీకి బరోసీ అని పేరు పెట్టాడు. 2016లో 50 ఆవులతో వ్యవసాయ క్షేత్రాన్ని రూపొందించిన తర్వాత బరోసీ కంపెనీని ప్రారంభించారు.
మెుదట్లో ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగలేదు. దీంతో పొదుపు చేసిన డబ్బు మొత్తం కరిగిపోవడం ప్రారంభమైంది. ఆ సమయంలో రావత్ నేరుగా గుర్గావ్‌కు వెళ్లి పాలు విక్రయించి కస్టమర్లను సంపాదించుకున్నాడు. పాలతో పాటు.. నెయ్యి, వెన్న వంటి ఉత్పత్తుల విక్రయం కూడా క్రమంగా పెరిగింది. దేశంలో మెుదలైన ఈకామర్స్ బూమ్ అర్థం చేసుకున్న రావత్ తన ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాడు. దీనికి తోడు ఉత్పత్తులను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంచాడు. దీంతో విక్రయాలు పెరిగాయి. అధునాతన మార్కెటింగ్ వినియోగించటంతో తన ఉత్పత్తులను అమెరికాకు కూడా ఎగుమతి చేస్తున్నాడు. ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.8 కోట్లను దాటింది.


Click it and Unblock the Notifications