Success Story: మధ్యతరగతి కుటుంబం నుంచి బిలియనీర్‌గా ఒక మహిళ ఎదగటం అంత సులువేమీ కాదు. కానీ దానిని నిజం చేసి చూపించారు కిరణ్ మజుందార్-షా.
దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపార దిగ్గజంగా ఉన్న బయోకాన్ గ్రూప్ కంపెనీని ఆమె ముందుకు నడుపుతున్నారు. విదేశీ ప్రమోటర్, అనేక బయోకాన్ గ్రూప్ కంపెనీల అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా ఉన్న జాన్ షాను 1998లో వివాహం చేసుకున్నారు. అయితే ఆయన అక్టోబర్ 24, 2022న మరణించారు. 1978లో కిరణ్ మజుందార్ బయోటెక్నాలజీ రంగంలో పనిచేయాలని నిర్ణయించుకుని బయోకాన్‌ను స్థాపించారు. అప్పట్లో కేవలం రూ.10,000 పెట్టుబడితో ఒక చిన్న గ్యారేజీలో ఆమె తన కలల కంపెనీని ప్రారంభించారు.

కిరణ్ మజుందార్ కర్ణాటకలోని బెంగళూరులో మార్చి 23, 1953న జన్మించారు. అక్కడే బిషప్ కాటన్ గర్ల్స్ హైస్కూల్‌లో చదివిన తర్వాత.. ఆమె బెంగుళూరు విశ్వవిద్యాలయానికి వెళ్లారు. డాక్టర్ కావాలని ఆమె కలలు కన్నప్పటికీ స్కాలర్షిప్ పొందలేక పోయారు. ఆమె తండ్రి రసేంద్ర మజుందార్ యునైటెడ్ బ్రూవరీస్‌లో హెడ్ బ్రూ మాస్టర్. తండ్రి సలహా మేరకు మాల్టింగ్, బ్రూయింగ్ అధ్యయనం కోసం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ బ్రూవర్‌గా పట్టా పొందారు. ఆ తర్వాత 1976లో ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత స్కాటిష్ కంపెనీలో ఉద్యోగం పొందారు. ఈ క్రమంలో ఆమె ఒక ఐరిష్ బయోటెక్ వ్యాపారవేత్తను కలుసుకోవడం యాదృచ్ఛికంగా జరిగింది.
ఆమె తయారు చేసిన ఎంజైమ్ అమెరికా, యూరప్ మార్కెట్లలో మంచి విజయం సాధించటంతో చిన్న గ్యారేజ్ నుంచి 20 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటుకు దారితీసింది. కిరణ్ మజుందార్ నాయకత్వంలోని బయోఫార్మాస్యూటికల్స్ రంగంలో బయోకాన్ గొప్ప లాభాలను ఆర్జించింది. ముఖ్యంగా క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు తక్కువ ఖర్చుతో కూడిన మందులను రూపొందించింది. ప్రస్తుతం బయోకాన్ కంపెనీ విలువ రూ.50,000 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications