Success Story: నెల జీతం రూ.1500 నుంచి రూ.3 కోట్లకు.. రియల్ సక్సెస్ స్టోరీ..
Ashfaq Sunawala Story: చదువుతో సంబంధం లేకుండా జీవితంలో సక్సెస్ అయ్యే వారు చాలా అరుదుగా ఉంటారు. అయితే వారి ఎదుగుదల వెనుక పెద్ద కష్టాలు దాగి ఉంటాయి. పట్టుదల, ధైర్యం, ఆత్మవిశ్వాసం, కష్టపడేతత్వం వారిని ఉన్నత స్థానాలకు చేరుస్తాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అష్ఫాక్ సునావాలా సక్సెస్ స్టోరీ గురించే. 2004లో రిటైల్ స్టోర్‌లో నెలకు రూ.1500 పనిచేసి ఇప్పుడు ఏడాదికి రూ.36 కోట్లు సంపాదిస్తున్నాడు. అంటే ప్రతి నెల దాదాపు రూ.3 కోట్ల ఆదాయం సంపాదిస్తూ సూపర్ సక్సెస్ అయ్యారు. వాస్తవానికి కుటుంబ పరిస్థితుల కారణంగా అష్ఫాక్ సునావాలా 10వ తరగతి తర్వాత చదువు మానేశాడు. డ్రాపౌట్ అయిన అష్ఫాక్ సునావాలా 2004లో రిటైల్ స్టోర్‌లో అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది.

అయితే జీవితంలో గొప్పవాడిగా మారాలనే ఆశయం అతడిని ఉద్యోగం నుంచి కొత్తవాటిని ప్రయత్నించేలా చేసింది. ఈ క్రమంలో దాదాపు 10 ఏళ్ల పాటు మంచి అవకాశాలను వెతుక్కుంటూ అనేక ఉద్యోగాలు మారాడు. చివరికి కాస్మెటిక్స్ దుకాణానికి మేనేజర్ అయ్యారు. కానీ అతని అంతర్ దృష్టి అతన్ని ఉన్నత లక్ష్యం వైపు పరుగెత్తేలా చేసింది. అలా 2013లో సునావాలా కొత్తగా ప్రారంభించిన రైడ్-హెయిలింగ్ యాప్ కోసం ఒక ప్రకటనను చూశాడు. యాప్ త్వరగా పాపులర్ అయింది. దాంతో అష్ఫాక్ సునావాలా పార్ట్ టైమ్ డ్రైవర్‌గా చేరాడు. అలా కంపెనీ ఇచ్చిన స్కీమ్ సహాయంతో చిన్న కారు ఒకటి కొనుగోలు చేశాడు.
మెుదట్లో రెండు ఉద్యోగాలను సమానంగా చేసిన సునావాలా ఉదయం 7 నుంచి కొన్ని గంటల పాటు డ్రైవింగ్ చేసేవాడు. తర్వాత తన ఉద్యోగానికి వెళ్లేవాడు. అలాగే రాత్రి కొద్ది సమయం క్యాబ్‌లు నడపడంతో గడిపేవాడు. అలా అతని ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఉద్యోగం ద్వారా నెలకు రూ.35 వేలు, పార్ట్ టైమ్ డ్రైవింగ్ ద్వారా రూ.15 వేలు సంపాదించాడు. ఆ తర్వాత రెండో కారు కొనేందుకు సునావాలా సోదరి సహాయం చేసింది. అలా రెండు కార్లను నడుపుతూ బ్యాంక్ రుణంతో మూడు కార్లు కొని డ్రైవర్లను నియమించుకున్నాడు. ఈఎంఐ చెల్లింపు తర్వాత డబ్బును దాస్తూ మళ్లీ అప్పు తీసుకుని కొత్త కార్లను కొనేవాడు. అలా తన ప్లాన్ సజావుగా సాగటంతో ఏకంగా 400 కార్లకు యజమాని అయ్యాడు.
డ్రైవింగ్ రంగంలో ఉన్న అనేక కష్టాలను సునావాలా ఎదుర్కొన్నారు. తన ఈ ప్రయాణంలో ఉద్యోగుల రాజీనామాలు, తప్పుడు ప్రవర్తన, పనిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితే వీటన్నింటినీ లెక్కచేయకుండా తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాడు. 500 కార్ల మార్కును అందుకోవటమే తన లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు జీతానికి పనిచేసిన స్థాయి నుంచి నేడు కోట్ల వ్యాపార టర్నోవర్ సాధించే స్థాయికి వెళ్లిన ఇతని విజయగాథ.. జీవితంలో విజయం సాధించటానికి మైండ్‌లో క్లారిటీ ఉంటే చాలా భారీ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదని రుజువుచేస్తోంది.


Click it and Unblock the Notifications