Tech News: దేశంలోని దిగ్గజ టెక్ కంపెనీలైన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ ఇటీవల తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు కొత్త రిక్రూట్మెంట్లకు దూరంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తెరమీదకు రావటం టెక్కీలను ఆందోళనకు గురిచేస్తోంది.
టీసీఎస్..:మార్చి 31, 2023 నాటికి టెక్ దిగ్గజం టీసీఎస్ 6,14,795 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇది సెప్టెంబర్ 2022 త్రైమాసికంలో వెల్లడించిన దానికంటే కొంత తక్కువ. మెుత్తం 150 దేశాలకు చెందిన ఉద్యోగుల్లో 35.7 శాతం మంది మహిళలు ఉన్నారు. అలాగే కంపెనీలో అట్రిషన్ రేటును గమనిస్తే 20.1 శాతంగా ఉంది. 2023 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో నికర ప్రాతిపధికన ఉద్యోగుల సంఖ్య 821 మేర పెరిగింది.

విప్రో..:ఇక దేశీయ ఐటీ కంపెనీ విప్రో విషయానికి వస్తే మార్చి 31, 2023 నాటికి ఉద్యోగుల సంఖ్య 2,56,921గా ఉంది. ఈ కాలంలో కంపెనీలో ఉద్యోగుల అట్రిషన్ రేటు భారీగానే తగ్గి 14.1 శాతానికి చేరుకుంది. త్రైమాసికంలో కంపెనీ కేవలం 5000 మంది ఉద్యోగులను కొత్తగా యాడ్ చేసింది. కంపెనీ అవసరాలకు అనుగుణంగా రిక్రూట్మెంట్స్ నిర్వహిస్తామని.. ప్రస్తుతం ఉద్యోగుల రాజీనామాల సంఖ్య తగ్గుతోందని సీఈవో వెల్లడించారు.
ఇన్ఫోసిస్..:అగ్రగామి ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ ఇటీవల ముగిసిన మార్చి త్రైమాసికంలో మెుత్తంగా 3,43,234 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ క్రమంలో డిసెంబర్ త్రైమాసికం కంటే ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఉద్యోగుల రాజీమాల శాతం భారీగా తగ్గి 20.9గా ఉంది. ఈ క్రమంలో కేవలం 1,627 మంది ఉద్యోగులను కంపెనీ రిక్రూట్ చేసుకుంది.
హెచ్సీఎల్ టెక్..:ఇటీవల ఫలితాలతో అంచనాలను మించి రిటర్న్స్ ఇచ్చిన హెచ్సీఎల్ టెక్ మార్చి 31, 2023 నాటికి 2,25,944 మంది ఉద్యోగులను కలిగి ఉంది. గత ఏడాది ఇదే సమయంలో పోల్చితే తగ్గుదలను నమోదు చేసింది. అట్రిషన్ రేటు స్వల్పంగా తగ్గి 19.5 శాతంగా నమోదైంది. 2023 ఆర్థిక స్వత్సరంలో కంపెనీ 17,067 ఉద్యోగులను నెట్ ప్రాతిపదికన పెంచింది.


Click it and Unblock the Notifications