Budget 2024: బడ్జెట్ తర్వాత లాభపడే స్టాక్స్ ఇవే.. లిస్టులో కీలక రైల్వే స్టాక్స్..
Budget Stocks: త్వరలోనే బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ఎన్నికల దృష్ట్యా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లలో కోలాహలం కొనసాగుతోంది.
ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ జూలై 23న కొత్తగా మోదీ నేతృత్వంలో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి తరఫున బడ్జెట్‌ను సమర్పించనున్నారు. మోదీ 3.0కి ఇదే తొలి పూర్తి బడ్జెట్ కావటంతో వ్యాపార వర్గాల నుంచి సామాన్య ప్రజల వరకు తమకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి కొన్ని పెద్ద ప్రకటనలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మౌలిక వసతుల కల్పనకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుండగా.. మరికొన్ని పాత ప్రణాళికలు సైతం కొనసాగించే అవకాశం కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అయితే ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్లలో అందరి దృష్టి కేంద్ర బడ్జెట్ నిర్ణయాల వల్ల ఏ రంగాలకు చెందిన కంపెనీలు లాభపడతాయనే అంశంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. బడ్జెట్‌లో ప్రభుత్వ దృష్టి విద్యుత్, పునరుత్పాదక ఇంధనంపై ఉండవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. ఈ రెండు రంగాలకు సంబంధించి కొత్త పథకాలతో పాటు మరిన్ని బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రకటించవచ్చని అంచనా వేస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కొన్ని బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రకటించవచ్చని అభిప్రాయపడింది.
గత రెండు దఫాలుగా మోదీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో దేశంలో నిరుపేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేసింది. ఈసారి బడ్జెట్లో సైతం దీనికి నిధులు అధికంగా కేటాయించవచ్చని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం కొత్త గృహనిర్మాణ పథకాన్ని కూడా ప్రకటించవచ్చు. ఇదే జరిగితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు భారీ లాభాలను ఆర్జించవచ్చు. వీటికి తోడు ఇన్వెస్టర్లు PFC, REC, IREDA షేర్లపై కూడా ఒక కన్నేసి ఉంచాల్సి ఉంది.
మోదీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్లో ప్రస్తుత ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగానికి మరింత బడ్జెట్‌ను ప్రకటించవచ్చని తెలుస్తోంది. దీని ద్వారా KNR కన్‌స్ట్రక్షన్, PNC ఇన్‌ఫ్రాటెక్, RITES, KEC ఇంటర్నేషనల్, J కుమార్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ షేర్లలో కదలిక కనిపించవచ్చని తెలుస్తోంది. అలాగే సిమెంట్ తయారీ కంపెనీలపై కూడా నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఎక్కువ నిధులను ప్రకటించడం అంటే సిమెంట్‌కు డిమాండ్ పెరుగుతుందని తద్వారా సిమెంట్ స్టాక్స్ లాభపడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే రైల్వే రంగానికి చెందిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(RVNL), ఐఆర్‌ఎఫ్‌సి, ఓరియంటల్ రైల్ స్టాక్స్ సైతం బడ్జెట్ ప్రకటనలతో లాభపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


Click it and Unblock the Notifications