Mutual Funds ఇన్వెస్టర్లకు శుభవార్త.. పెద్ద ప్రకటన చేసిన రెగ్యులేటర్ SEBI
SEBI News: దేశీయంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చాలా మంది చిన్న పెట్టుబడదారులు సైతం ప్రస్తుతం చిన్న మెుత్తంలో పొదుపు చేయటానికి కూడా ఈ మార్గాన్నే చాలా మంది ఎంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) కీలక ప్రకటన చేసింది. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాల్లో నామినీలకు సంబంధించి నిబంధనల విషయంలో పెద్ద మార్పులను ప్రకటించింది. ఇకపై ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ ఖాతాలతో పాటు ఫండ్ ఫోలియోలో 10 మంది వరకు వ్యక్తులను నామినీలుగా చేర్చవచ్చని తెలుస్తోంది. కొత్త నిబంధనలు మార్చి 1, 2025 నుంచి అమలులోకి వస్తాయని సెబీ వెల్లడించింది.

వాస్తవానికి పెట్టుబడిదారులు మరణించిన సమయంలో క్లెయిమ్ చేయని ఆస్తులు లేదా పెట్టుబడులను తగ్గించే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబీ వెల్లడించింది. అనేక సార్లు పెట్టుబడిదారుడు మరణిస్తే లేదా తీవ్ర అనారోగ్యానికి గురైతే.. అతడు లేదా ఆమె కుటుంబ సభ్యుల మధ్య వివాదాల కారణంగా సదరు ఆస్తులను క్లెయిమ్ చేయటం జాప్యం జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఎవ్వరూ సదరు పెట్టుబడులను క్లెయిమ్ చేయరు. మరికొన్ని సార్లు పెట్టుబడులకు సంబంధించిన వివరాలు తెలియని సమయంలో కూడా అవి నిరుపయోగంగా కొనసాగుతుంటాయి. వీటిని పరిష్కరించేందుకు సెబీ తాజా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
అందుకే పెట్టుబడులకు నామినీలను అందించే క్రమంలో ఇన్వెస్టర్లు వారికి సంబంధించిన ఫోన్ నంబర్, ఈ-మెయిల్, చిరునామా, ఆధార్ నంబర్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది. అంటే పెట్టుబడిదారులు తమ నామినీకి సంబంధించిన మెుత్తం వివరాలను పూర్తిగా అందించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. అలాగే ఎక్కువ మంది నామినీలను చేర్చేందుకు సైతం అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలో నామినీతో ఉండే సంబంధం వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇన్వెస్టర్ల పవర్ ఆఫ్ అటార్నీకి నామినీలను ప్రకటించే అధికారం ఉండదని కూడా సెబీ స్పష్టం చేసింది.
నామినీల వివరాలను పెట్టుబడిదారులు ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా లేదా ఆఫ్‌లైన్‌లో నామినీ ఫారమ్ నింపి సమర్పించటం ద్వారా అందించవచ్చని సెబీ తెలిపింది. మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు, డిపాజిటరీలకు దీనికోసం సెబీ తగిన ఆదేశాలను జారీ చేసింది. ఒక్కసారి వివరాలు పూరించాక ఆ సమాచారం ఇన్వెస్టర్లకు తెలియజేయపడుతుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం పెట్టుబడిదారుడు భౌతికంగా అసమర్థత కలిగి ఉంటే.. తన నామినీల్లో ఒకరికి ఖాతాను నిర్వహించటానికి అప్పగించవలసి ఉంటుంది.


Click it and Unblock the Notifications