Rule Changing: కొత్త ఏడాది ప్రజల జేబుపై ప్రభావం చూపే అంశాలివే.. ఈ మార్పులు గమనించాల్సిందే..
Rule Changing in January: ప్రతినెల మాదిరిగానే కొత్త సంవత్సరం మెుదటి తారీఖున సైతం ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపే కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ క్రమంలో జనవరి 1, 2025 నుంచి మారుతున్న వివిధ రూల్స్ ప్రజల జేబుపై ఎలాంటి భారాన్ని కలిగిస్తాయనే అంశాలను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
* ముందుగా జనవరి 1, 2025 నుంచి టెలికాం కంపెనీలకు కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. వీటి ప్రకారం ఈ రంగంలోని కంపెనీలు ఆప్టికల్ ఫైబర్, కొత్త మొబైల్ టవర్లను ఇన్‌స్టాల్ చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ చర్యలు యూజర్ల అనుభవంతో పాటు సేవలను మెరుగుపరచటానికి సహాయపడతాయి. టవర్‌ను ఇన్‌స్టాల్ చేసే ప్రక్రియలో తక్కువ అవాంతరం ఉంటుంది.

* ఇక ప్రజలు గుర్తించాల్సిన రెండవ అంశం అమెజాన్ ఇండియాకు సంబంధించినది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ నిబంధనలను 1 జనవరి 2025 నుంచి మార్చేసింది. మారుతున్న రూల్స్ ప్రకారం ఇకపై యూజర్లు తమ ప్రైమ్ మెంబర్‌షిప్ ద్వారా ఒక ఖాతా నుంచి కేవలం రెండు టీవీల్లో ప్రసారాలను వీక్షించటానికి అవకాశం ఉంటుంది. మరిన్ని టీవీల్లో కనెక్ట్ చేసేందుకు ప్రసారం చేయడానికి అదనపు చెల్లింపు తప్పనిసరిగా మారింది.
* కొత్త సంవత్సరం మెుదటి రోజు నుంచి జీఎస్టీకి సంబంధించిన పోర్టల్ లో కూడా ముఖ్యమైన మార్పులు వస్తున్నాయని వ్యాపారులు గుర్తించాల్సి ఉంటుంది. ముందుగా ఈవేబిల్లు, పరిధి చెల్లుబాటుకు సంబంధించి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. అలాగే జీఎస్టీ పోర్టల్ సురక్షితమైన యాక్సెస్‌కి సంబంధించిన మార్పులు కూడా అమలులోకి వస్తున్నాయి. నిబంధనలను పాటించకపోతే వ్యాపారులు నష్టాలను చూడాల్సి వస్తుందని తెలుస్తోంది.
* ప్రతి నెల మాదిరిగానే చమురు కంపెనీలు జనవరి నెల మెుదటి రోజున తమ గ్యాస్ ధరల్లో మార్పులను ప్రకటించే అవకాశం ఉంది. కొన్ని నెలలుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను సదరు కంపెనీలు పెంచిన సంగతి తెలిసిందే. అలాగే సీఎన్జీ, పీఎన్జీ ధరలు సైతం మార్పులను చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.
* కొత్త సంవత్సరంలో కారు కొనుక్కోవాలని భావిస్తున్న వ్యక్తులకు షాక్ తగలనుంది. ప్రధాన ఆటో కంపెనీలు తమ వాహన ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి ప్రధాన కంపెనీలు తమ కొత్త ధరలను జనవరి 1 నుంచి అమలులోకి తీసుకురావాలని చూస్తున్నాయని తెలుస్తోంది. పెరుగుతున్న ఉత్పత్తి ధరలకు అనుగుణంగా ఈ మేరకు కంపెనీలు మార్పులు చేస్తున్నాయని తెలుస్తోంది.
* నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఫిక్స్‌డ్ డిపాజిట్లను నియంత్రించే నిబంధనలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మార్పులు జనవరి 1, 2025 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ కొత్త మార్గదర్శకాలు పబ్లిక్ డిపాజిట్ అంగీకారం, కనీస శాతం లిక్విడ్ ఆస్తుల నిర్వహణ, పబ్లిక్ డిపాజిట్ కోసం పూర్తి కవర్, ఎమర్జెన్సీ స్వభావం కొన్ని ఖర్చులను తీర్చడానికి పబ్లిక్ డిపాజిట్‌ను తిరిగి చెల్లించడం వంటి వాటికి సంబంధించినవి.


Click it and Unblock the Notifications