Sukanya Samriddhi Yojana: ఆడపిల్లలు ఉన్న వ్యక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన స్మాల్ సేవింగ్ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన. ప్రజల నుంచి మంచి స్పందన పొందుతున్న ఈ స్కీమ్ నిబంధనలను మార్చుతూ కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. సర్క్యులర్ ప్రకారం కొత్తగా ఆరు నిబంధనలను జారీ చేసింది. ఈ నియమాలు నేషనల్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలకు సంబంధించినది. దీంతో చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మారిన నిబంధనల గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు.

చట్టబద్ధమైన సంరక్షకులు కాకుండా ఇతర వ్యక్తుల సంరక్షకత్వంలో ఖాతాలు తెరిచినట్లయితే.. చట్టం ప్రకారం అర్హులైన వ్యక్తికి అంటే సహజ సంరక్షకుడికి (సజీవంగా ఉన్న తల్లిదండ్రులు) లేదా చట్టపరమైన సంరక్షకుడికి బదిలీ చేయబడుతుంది. స్కీమ్ ప్రకారం 2019లోని పారా 3ని ఉల్లంఘించి ఒక కుటుంబంలో రెండు కంటే ఎక్కువ ఖాతాలు తెరిచినట్లయితే.. వాటిని పథకం మార్గదర్శకాలను ఉల్లంఘించి తెరిచిన ఖాతాలుగా పరిగణించడం ద్వారా సక్రమంగా లేని ఖాతాలు మూసివేయబడనున్నాయి.
ఎవరైనా వ్యక్తి కుమార్తెల కోసం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన కింద డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ పెట్టుబడులు సెక్షన్ 80C కింద పన్ను నుంచి పూర్తిగా పన్ను మినహాయింపు పొందేందుకు అర్హమైనవి. స్కీమ్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసేందుకు వెసులుబాటు ఉంది. అయితే ఏదానా ఆర్థిక సంవత్సరంలో కనీస మెుత్తాన్ని డిపాజిట్ చేయటంలో విఫలమైతే రూ.50 జరిమానాగా విధించబడుతుందని పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాలి.
ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఒకవేళ ఖాతాదారుడు 21 సంవత్సరాల వ్యవధి పూర్తయ్యేలోపు వివాహం చేసుకున్నట్లయితే.. వారి వివాహ తేదీ తర్వాత ఖాతాను ఆపరేట్ చేయడానికి అనుమతించబడదు. ఉన్నత విద్య, వివాహ ప్రయోజనం కోసం ఖాతాదారు అవసరాలను తీర్చడానికి పాక్షిక ఉపసంహరణ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇందులో కల్పించింది. ప్రస్తుతం దేశంలో ఉన్న అనేక సురక్షితమైన పొదుపు పథకాల్లో ఉత్తమ రాబడులను ఇస్తున్న స్కీమ్ గా సుకన్య సమృద్ధి యోజన గుర్తింపు పొందటంతో పాటు భారీగా ప్రజాధరణను అందుకుంటోంది.


Click it and Unblock the Notifications