ఆర్థికానికి వర్షాలకు మధ్య సంబంధం ఏంటి..? స్టాక్ మార్కెట్లు ఎందుకు రియాక్ట్ అవుతాయ్
Indian Economy: దేశ ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగాలంటే వ్యవసాయం సుభీక్షంగా ఉండాలి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ విడుదల చేసే వివరాలు చాలా కీలకమైనవి. 2023లో భారతదేశంలో సాధారణ రుతుపవనాలు ఉంటాయని తాజాగా ప్రకటించింది.
నైరుతి రుతుపవనాలు దేశంలో సగానికి పైగా వ్యవసాయ భూములకు సాగునీటిని అందిస్తాయి. సాధారణ వర్షపాతం వల్ల సకాలంలో పంటలు పండి దేశానికి అవసరమైన ఆహారధాన్యాలు పుష్కలంగా లభించటంతో పాటు రూరల్ డిమాండ్ పుంజుకుంటుంది. ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా అవసరమైన అంశం. తద్వారా ఆహార పదార్థాల ధరలు స్థిరంగా ఉండటానికి దోహదపడుతుంది.

జూన్‌లో ప్రారంభమయ్యే నాలుగు నెలల సీజన్ 10 సంవత్సరాల సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే.. అది 96-104 శాతంగా ఉంటే దానిని సాధారణ రుతుపవనాలుగా పరిగణిస్తారు. ఈ క్రమంలో 2023 సంవత్సరంలో 96 శాతం వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి.
దేశంలో సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోని లీడ్ ఎకనామిస్ట్ మాధ్వీ అరోరా వెల్లడించారు. దీనివల్ల భారతీయ రిజర్వు బ్యాంక్ వేగంగా వడ్డీ రేట్లను తగ్గించటానికి అవకాశం లభించనుంది. వర్షపాతాలు సజావుగా ఉండటం వల్ల దేశంలోని FMCG కంపెనీలు, ఎరువుల కంపెనీలు, చక్కెర కంపెనీల్లో మార్జిన్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉత్పత్తి ఖర్చులు తక్కువగా ఉండటంతో పాటు గ్రామీణ వినియోగం పెరుగుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వినోద్ నాయర్ తెలిపారు.

అయితే ఎల్ నినో ప్రభావం వల్ల పేలవమైన రుతుపవనాలు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది గ్రామీణ డిమాండ్‌కు ఇబ్బందిని కలిగిస్తుంది. వ్యవసాయం, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆటో వంటి రంగాలను దెబ్బతీస్తుంది.


Click it and Unblock the Notifications