Akshaya Tritiya 2024: భారతీయ ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. మే 10న అక్షయతృతీయ సందర్భంగా చాలా మంది కనీసం ఒక్క గ్రాము బంగారం కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారు గుర్తుంచుకోవాల్సిన కీలకమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భారతీయులు బంగారాన్ని కేవలం సంపదకు చిహ్నంగా మాత్రమే కాకుండా సంప్రదాయాలు, వారసత్వం వంటి అనేక ఇతర కారణాలతో కూడా కొంటుంటారు. అక్షయతృతీయకు బంగారం, వెండి వస్తువులను కొనటం చాలా మంది శుభప్రదంగా భావిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు దీనిని నిజంగా పెద్ద పండుగగా జరుపుకుంటుంటారు. ఆ రోజు లక్ష్మీదేవికి చాలా మంది పూజలు సైతం చేస్తుంటారు.

పసిడి కొనుగోలులో అన్నింటి కంటే ముఖ్యమైనది వాటి స్వచ్ఛతను ధృవీకరించుకోవటం. బంగారం నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు కాబట్టి ఆభరణాల కొనుగోలు సమయంలో దీనిని తప్పక పరిశీలించాలి. వాస్తవానికి హాల్ మార్కింగ్ కలిగిన బంగారు వస్తువులను కొనుగోలు చేయటం శ్రేయస్కరం. పెట్టుబడికోసం లేదా నాణేలు కొనుక్కునే వారు 99.99%+ ప్యూరెస్ట్ గోల్డ్ 24 క్యారెట్ల పసిడి కోసం వెతకాలని MMTC-PAMP మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO వికాస్ సింగ్ అన్నారు. ప్రతి ఒక్కరూ హాల్ మార్కింగ్ ఉన్న ఆభరణాలను లేదా నమ్మకమైన విశ్వసనీయ డీలర్ల నుంచి మాత్రమే ఆభరణాలను కొనాలని ఆయన సూచించారు. ఇది తక్కువ నాణ్యత కలిగిన పసిడి కొనుగోళ్ల నుంచి వినియోగదారులను రక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు.
దీని తర్వాత వినియోగదారులు దృష్టి సారించాల్సింది మేకింగ్ ఛార్జీలపైనే. ఇవి బంగారాన్ని ఆభరణాలుగా మార్చడానికి అయ్యే ఖర్చులు. వేర్వేరు ఆభరణాల వ్యాపారులు వేర్వేరు మేకింగ్ ఛార్జీలను కలిగి ఉండవచ్చు. కాబట్టి మీరు మంచి డీల్ పొందారని నిర్ధారించుకోవడానికి మార్కెట్లో ఒకటి కంటే ఎక్కువ షాపుల్లో సంప్రదించి రేట్లను తెలుసుకోవటం ఉత్తమం. ఇక కొనుగోలులో అన్నింటి కంటే ముఖ్యమేనది ఆభరణాల హాల్‌మార్క్ తనిఖీ చేయటం. ఇది సదరు బంగారు స్వచ్ఛతకు ఇచ్చే గ్యారెంటీ. బంగారు ఉత్పత్తుల సర్టిఫికేషన్ వాటి ప్రామాణికతను, ప్రపంచ ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చేస్తుంది.
అయితే షాపింగ్ చేయటానికి వెళ్లేటప్పుడు తప్పకుండా అందుకోసం బడ్జెట్ సెట్ చేసుకోవాలి. అక్షయతృతీయను శుభప్రదంగా భావిస్తారు కాబట్టి ఎక్కువ మెుత్తం డబ్బు ఖర్చు చేయకుండా అవసరమైన మేరకు గోల్డ్ షాపింగ్ చేయటం ఉత్తమం. అనిశ్చిత పరిస్థితుల్లో బంగారాన్ని చాలా మంది సంపదను కాపాడే సాధనంగా దశాబ్ధాలుగా వినియోగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులతో చాలా మంది బంగారాన్ని ఎక్కువగా కొనేందుకు మక్కువ చూపుతున్నారు. అందుకే గత రెండు నెలలుగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఎవ్వరూ కలలో కూడా ఊహించని స్థాయిలకు చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications