Budget 2024: ఎన్నికల ముందు 2019 బడ్జెట్ వరాలివే.. మరి 2024 ఎన్నికల తాలియాల మాటేంటో..?
Interim Budget 2024: ఎన్నికల ఏడాదిలో వాస్తవానికి వార్షిక బడ్జెట్ సమావేశాలకు బదులుగా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ఇది ఎన్నికల వరకు ప్రభుత్వం నడిచేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వాలకు అందిస్తుంది.
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఇంటెరిమ్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటిస్తారు. ఓటాన్ అకౌంట్ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్-జూలై కాలానికి అవసరమైన నిధులను పొందేందుకు వీలు ఏర్పడుతుంది. అయితే 2019లో ఎన్నికలకు ముందర ఇదే పరిస్థితి ఏర్పడినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ అనేక కీలక ప్రకటనలను ప్రజల కోసం బడ్జెట్లో చేసింది.

పీఎం కిసాన్: ముందుగా కేంద్ర మంతి పీయూష్ గోయల్ ఆ సమయంలో పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రకటించారు. స్కీమ్ ద్వారా దేశంలోని అర్హులైన రైతులందరికీ ఏడాదికి రూ.6,000 చొప్పున పంట సాయం విడతలవారీగా అందిస్తామని ప్రకటించారు. దీని ద్వారా దాదాపు 12 కోట్ల చిన్న మధ్య తరగతి రైతులకు మూడు దఫాలుగా డబ్బును నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తామని ప్రకటించారు. తర్వాతి నెలలో ప్రధాని మోదీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఫిషరీస్ డిపార్ట్మెంట్: చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ రంగంపై ఆధారపడిన సుమారు 1.45 కోట్ల మంది ప్రజల జీవనోపాధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం 7% కంటే ఎక్కువ వృద్ధిని ప్రోత్సహించాలనుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణం పొందే పశుపోషణ, మత్స్య పరిశ్రమల కార్యకలాపాలను కొనసాగించే రైతులకు 2 శాతం వడ్డీ రాయితీని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
గోకుల్ మిషన్: ఆవు వనరుల స్థిరమైన జన్యు నవీకరణ.. ఆవుల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కోసం రూ.750 కోట్లు కేటాయించారు.

రైల్వేలకు నిధులు: దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు 2019 కేంద్ర ఇంటెరిమ్ బడ్జెట్‌లో భారతీయ రైల్వేలకు రూ.1.58 లక్షల కోట్లు కేటాయించారు. దీనికి తోడు అసంఘటిత రంగ కార్మికులు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.100 చందాపై నెలకు రూ.3,000 చొప్పున నెలవారీ పెన్షన్ అందించేందుకు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోసం MNREGA పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించారు.


Click it and Unblock the Notifications