Diwali 2024 Shares: దేశీయంగా దీపావళికి స్టాక్ మార్కెట్లలో ఒక ప్రత్యేక చర్య ఆనవాయితీగా వస్తూనే ఉంది. ముహురత్ ట్రేడింగ్ పేరుతో దీపావళి రోజు సాయంత్రం ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కేవలం ఒక్క గంట పాటు ట్రేడింగ్ కొనసాగుతుంది. ఈ సమయంలో కొత్త పెట్టుబడులతో ప్రయాణం ప్రారంభించటాన్ని చాలా మంది శుభప్రదంగా భావిస్తుంటారు. ఇందుకోసం అనేక బ్రోకరేజ్ సంస్థలు అందించే రిపోర్టులను పరిశీలిస్తుంటారు.
ఇదే క్రమంలో దేశీయ బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ ఇన్వెస్టర్లకు దీపావళికి 6 షేర్లను ఎంపిక చేసింది. ఈ క్రమంలో ముందుగా ఇటీవల ఐపీవోగా మార్కెట్లోకి అడుగుపెట్టిన కెఆర్కె హీట్ ఎక్స్‌ఛేంజర్ కంపెనీ షేర్లను కొనుగోలు చేయాలని సూచించింది. రానున్న 12 నెలల కాలంలో స్టాక్ ధర రూ.550 స్థాయికి చేరుకుంటుందని బ్రోకరేజ్ పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ట్యూబ్ తరహా హీట్ ఎక్స్‌ఛేంజర్ వినియోగం పరిశ్రమల్లో పెరుగుతోందని బ్రోకరేజ్ పేర్కొంటూ భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయంది. ఇదే క్రమంలో బ్రోకరేజ్ ఎంపిక చేసిన రెండవ స్టాక్ తేజాస్ నెట్వర్క్స్. ప్రస్తుత మార్కెట్ ధర రూ.1,292 కంటే 28 శాతం పెరిగి స్టాక్ ధర రూ.1650కి చేరుకుంటుందని ఆనంద్ రాఠీ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ రూ.4,845 కోట్లుగా ఉండగా కంపెనీ బీఎస్ఎన్ఎల్ 4జీ,5జీ కోసం పనిచేస్తోంది. అలాగే భారతీయ రైల్వేస్ కవచ్ కోసం కూడా పనిచేస్తోంది.

బ్రోకరేజ్ రాడార్ లో ఉన్న మరో కంపెనీ డేటా ప్యాట్రన్స్ కంపెనీ షేర్లు ఉన్నాయి. కంపెనీ షేర్ల ధర ప్రస్తుతం ఉన్న రూ.2,264 కంటే 26 శాతం పెరిగి రూ.2,850కి చేరుకోవచ్చని అంచనాలు ప్రకటించింది. కంపెనీ ప్రస్తుతం 100 విదేశీ ఆర్డర్లను దక్షిణ కొరియా, యూరప్ వంటి దేశాల నుంచి అందుకుంది. రానున్న కాలంలో కంపెనీ రూ.1000 కోట్ల ఆర్డర్ పొందనున్నట్లు అంచనా వేయబడింది. ఇదే క్రమంలో ఏవియేషన్ రంగంలోని ఇండిగో కంపెనీ షేర్లపై బ్రోకరేజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. రానున్న ఏడాది కాలంలో స్టాక్ ధర రూ.5,300కి చేరుకుంటుందని అంచనా వేసింది. విమానాశ్రయాల నిర్మాణంలో ప్రభుత్వం చేసిన భారీ పెట్టుబడులు, ఉడాన్ పథకం, ప్రయాణీకుల సంఖ్య పెరుగుదల విమానయాన పరిశ్రమ ముందుకు సాగడానికి కొన్ని వృద్ధి ట్రిగ్గర్లుగా మారతాయని బ్రోకరేజ్ పేర్కొంది.
కొనుగోలు చేసే షేర్ల సూచన జాబితాలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లకు బ్రోకరేజ్ చోటు కలిపించింది. రానున్న ఏడాది కాలంలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.370 కి చేరుకోవచ్చని వెల్లడించింది. కంపెనీ ప్రస్తుతం రెన్యూవబుల్ ఎనర్జీ రంగంపై తన దృష్టిని సాధించటంపై బ్రోకరేజ్ బులిష్‌గా ఉంది. ఇక చివరిగా బ్రోకరేజ్ పేర్కొన్న షేర్ల జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు చోటు దక్కించుకున్నాయి. కంపెనీ షేర్లు ప్రస్తుత మార్కెట్ ధర కంటే 15 శాతం పెరిగి రానున్న ఏడాది కాలంలో రూ.3250కి చేరుకుంటాయని ఆనంద్ రాఠీ వెల్లడించింది. హిందువుల క్యాలెండర్ ప్రకారం సాంవత్ 2081కి పైన పేర్కొన్న షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చని బ్రోకరేజ్ పేర్కొంది.


Click it and Unblock the Notifications