Gold: ఒక వ్యక్తి ఎంత బంగారం కలిగి ఉండవచ్చు..? రూల్స్ ఇప్పుడు తెలుసుకోండి..
Gold Limits: గోల్డ్ పై భారతీయుల ప్రేమ కేజీఎఫ్ సినిమాలో లాంటిదే. బంగారం బంగారం బంగారం.. భారతీయులు ఎక్కువగా ఇష్టపడేది దీనినే. ఇండియన్స్ కాంట్ ఎవాయిడ్ గోల్డ్. ఇది అక్షరాలా నిజం. కాస్త డబ్బులుంటే చాలు ఎన్ని గ్రాములు బంగారం కొనాలా అని ఆలోచిస్తారు భారతీయులు. ఇది పూర్వం నుంచి వస్తున్న అలవాటు. అసలు మన దేశంలో ఒక వ్యక్తి వద్ద ఎన్ని గ్రాముల వరకు బంగారం కలిగి ఉండవచ్చో మీకు తెలుసా. భారత ప్రభుత్వం దీనిపై విధించిన పరిమితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

లిమిట్ దాటి బంగారం ఉంటే ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటుందా?
గ్రామాల్లో వ్యవసాయం, పశుసంపద నుంచి వచ్చే ఆదాయంతో చాలా మంది బంగారు ఆభరణాలను కొంటుంటారు. ఈ విషయం ఆదాయ శాఖకు తెలిస్తే ఆ నగలను జప్తు చేయవచ్చని ఇటీవల కొందరు ఆందోన చెందుతున్నారు.దీంతో అనేక మందిలో భయాలు ప్రారంభమయ్యాయి. ఈ అంశంపై చట్టాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకోవడం అత్యవసరం.. ఇప్పటికే దేశంలో బంగారం నియంత్రణ చట్టాన్ని రద్దు చేశారు. అందువల్ల బంగారం కలిగి ఉండే పరిమితికి సంబంధించి ఎటువంటి లిమిట్స్ లేవు. ఒక సర్క్యులర్‌లో.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ బంగారం నిల్వ పరిమితిని నిర్ణయించింది.

ఆడవారికెంత..? మగవారికెంత..?
CDDT రూల్స్ ప్రకారం పెళ్లి అయిన మహిళలు 500 గ్రాముల బంగారు ఆభరణాలను కలిగి ఉండవచ్చు. అదే పెళ్ళికాని అమ్మాయిల విషయంలో ఈ పరిమితి 250 గ్రాములుకు పరిమితం చేయబడింది. పెళ్లి అయినా కాకపోయినా.. కుటుంబంలోని ప్రతి ఒక్క పురుషుడు 100 గ్రాముల వరకు బంగారాన్ని తమతో ఉంచుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించినప్పుడు.. పైన చెప్పిన పరిమితుల వరకు బంగారు ఆభరణాలను జప్తు చేయదు.

ఎప్పుడు బంగారం జప్తు కుదరదు..
కుటుంబ ఆదాయం, సమాజంలో హోదాతో సంబంధం లేకుండా పన్ను అధికారులు పైన తెలిపిన పరిమితి వరకు బంగారు ఆభరణాలను జప్తు చేయకూడదని CBDT సర్క్యులర్ స్పష్టం చేసింది. లిమిట్ వరకు కలిగి ఉన్న బంగారం విషయంలో..ఆదాయ వనరుల గురించి సదరు కుటుంబం వెల్లడించక పోయినా ఇబ్బంది లేదు. ఇలాంటి సమయంలో ఆ ఆభరణాలను అధికారులు జప్తు చేయరని ప్రజలు తెలుసుకోవాలి.

రూల్స్ కి మించి బంగారం కలిగి ఉండకూడదా..?
గోల్డ్ పై రూల్స్ కేవలం టాక్స్ లెక్కింపు కోసమే. వ్యక్తులు అంతకు మించి కూడా బంగారాన్ని కొనుక్కోవచ్చు. ఆదాయపన్ను అధికారులు రైడ్ చేసినప్పుడు రూల్స్ ప్రకారం ఆ మెుత్తాన్ని పక్కన పెట్టి మిగిలిన బంగారాన్ని మాత్రమే స్వాధీనపరుచుకుంటారు. దానికి సంబంధించిన బిల్స్, ఇతర సాక్ష్యాలను ఆదాయపన్ను శాఖకు అందించాలి. వివరాలు సక్రమంగా అందిస్తే టాక్స్ అధికారులు నగలను జప్తు చేయరు. అయితే.. ఈ ఆభరణాల కొనుగోలు కోసం సేకరించిన డబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలను వారికి అందించాల్సి ఉంటుంది.

పూర్వికుల నుంచి బంగారం పొందితే..
మీరు పన్ను చెల్లించిన డబ్బుతో ఆభరణాలను కొనుగోలు చేసినట్లయితే.. ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదు. దీని కోసం.. అన్ని కొనుగోలు రశీదులను జాగ్రత్తగా ఉంచడం అవసరం. మీరు ఏదైనా పాత ఆభరణాలను ఎక్ఛేంజ్ లో ఇచ్చి కొత్త వాటిని కొన్నా.. వాటికి సంబంధించిన రశీదులను, మేకింగ్ ఛార్జీల రశీదులను కూడా తప్పనిసరిగా జాగ్రత్త చేసుకోవాలి. పూర్వికుల నుంచి బంగారం వారసత్వంగా వచ్చినట్లయితే.. దానిని బ్యాంకు లాకర్‌లో ఉంచినా లేదా ఇంట్లో ఉంచినప్పటికీ.. మీరు దానికి సంబంధించిన వీలునామా కాపీని కూడా ఉంచుకోవాలి. మీకు వారసత్వంగా వచ్చిన ఆభరణాలకు సంబంధించిన సాక్ష్యాలను మీరు సమర్పించినట్లయితే.. టాక్స్ అధికారులు మీ వద్ద ఉన్న బంగారాన్ని జప్తు చేయలేరు.


Click it and Unblock the Notifications