Nova Agritech IPO: ఈవారం సైతం మార్కెట్లోకి కొన్ని ఐపీవోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేస్తున్నాయి. పెట్టుబడిదారులు సైతం మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీల ఐపీవోలను అస్సలు వదులుకోవటం లేదు.
ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది నోవా అగ్రిటెక్ ఐపీవో గురించే. రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం కంపెనీ ఇష్యూను జనవరి 23న ప్రారంభిస్తోంది. ఇష్యూ ద్వారా కంపెనీ మెుత్తంగా రూ.143.81 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. జనవరి 25న ముగియనున్న ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 77.85 లక్షల షేర్లతో పాటు 2.73 కోట్లు తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయించాలని నిర్ణయించింది.

ఐపీవో కోసం కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.39-41గా నిర్ణయించింది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.112 కోట్లను సేకరిస్తుండగా.. ఓఎఫ్ఎస్ రూపంలో రూ.31.81 కోట్లను సమీకరిస్తోంది. సురక్ష అగ్రి రిటైల్స్(ఇండియా), మాలతి ఎస్, కిరణ్ కుమార్ ఆటుకూరి కంపెనీకి ప్రమోటర్లుగా ఉన్నారు. ఐపీవో ద్వారా సేకరించిన మెుత్తంలో రూ.14.20 కోట్ల విలువైన తాజా ఇష్యూ సొమ్మును కంపెనీ తన అనుబంధ సంస్థ నోవా అగ్రి సైన్సెస్‌లో కొత్త ఫార్ములేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి, రూ.10.49 కోట్లను నోవా అగ్రిటెక్ ద్వారా మూలధన వ్యయం కోసం ప్రస్తుత ఫార్ములేషన్ ప్లాంట్‌ని విస్తరించడానికి వినియోగించనుంది. మిగిలిన మెుత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఉపయోగించనుంది.
నోవా అగ్రిటెక్ అనేది వ్యవసాయ-ఇన్‌పుట్ తయారీదారు. ఇది టెక్-ఆధారిత రైతు-ఆధారిత పరిష్కార విధానంపై దృష్టి కేంద్రీకరించిన నేల ఆరోగ్య నిర్వహణ, పంట పోషణ, పంట రక్షణ ఉత్పత్తులను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో కంపెనీకి 11,722 మంది డీలర్లు ఉన్నారు. కంపెనీ నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాంలలో సైతం థర్డ్ పార్టీ ఒప్పందాల ద్వారా విక్రయాలను జరుపుతోంది.


Click it and Unblock the Notifications