Accenture లేఆఫ్‌లతో ఇండియన్ టెక్కీలకు భారీ నష్టం తప్పదా..? పరిస్థితులు చేజారిపోయాయా..??
Accenture layoffs: టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఉద్యోగుల తొలగింపుల విషయంలో సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుత వ్యాపార మందగమనం కారణంగా వ్యూహాత్మక ముందడుగులో భాగంగా ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రానున్న 18 నెలల కాలంలో దాదాపు 19,000 మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్లు వెల్లడించటం ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించినప్పటికీ అందులో భారతీయ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం ఉండనుందనే విషయాన్ని మాత్రం కంపెనీ బహిర్గతం చేయలేదు. గణాంగాల ప్రకారం యాక్సెంచర్ కు ఇండియాలో దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెుత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 40 శాతం. ఈ క్రమంలో లేఆఫ్ ప్రకటన సమయంలో ఇండియన్ టెక్కీలు కూడా భారీగానే ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కంపెనీ భారతదేశంలో అతిపెద్ద పాదముద్రను కలిగి ఉంది. అభివృద్ధి, మార్కెట్, వ్యాపారాల పరంగా కూడా కంపెనీకి ఇండియా చాలా కీలకమైనది. కంపెనీ తాజాగా ప్రకటించిన తొలగింపుల్లో సగానికిపైగా ఉద్యోగులు బిల్ చేయని కార్పొరేట్ విధుల్లో ఉన్నారని యాక్సెంచర్ తెలిపింది. ఈ తొలగింపులలో దాదాపు సగం FY23లో లేదా ఆగస్టు 31కి ముందు ఉంటాయని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ KC మెక్‌క్లూర్ స్పష్టం చేశారు.

కంపెనీ ఉద్యోగుల తొలగింపులు, సిబ్బంది ఖర్చుల కోసం దాదాపు 1.2 బిలియన్ డాలర్ల మెుత్తాన్ని వెచ్చించాలని నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వ్యాపార ఆప్టిమైజేషన్ ఖర్చుల కోసం కంపెనీ వెచ్చించనున్న 1.5 బిలియన్ డాలర్లలో ఇది భాగమని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఆదాయం 8-11 శాతం మధ్య తగ్గే అవకాశం ఉన్నట్లు కంపెనీ ఇప్పటికే అంచనా వేసింది. కంపెనీ బ్యాలెన్స్ షీట్ బలపరిచేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 7.38 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. తాజా త్రైమాసికంలో కంపెనీ దాదాపు 22 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను సాధించింది.


Click it and Unblock the Notifications