ATMలో పాడైన నోట్లు వస్తే ఏం చేయాలి..? సులువుగా మార్చుకోండి ఇలా..
RBI Rules: ఈ రోజుల్లో చాలా మంది యూపీఐ చెల్లింపులు నిర్వహిస్తున్నప్పటికీ.. ఏటీఎంలకు గిరాకీ ఏ మాత్రం తగ్గలేదు. చాలా మంది ప్రజలు డబ్బు విత్‌డ్రా కోసం ఏటీఎంలను ఆశ్రయిస్తున్నారు. అయితే చాలాసార్లు చిరిగిన, పాడైన నోట్లు వస్తుంటాయి. మనలో చాలా మందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చిరిగిన నోట్లు..
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు చిరిగిన నోట్లు వస్తే.. కొనుగోలు చేసేటప్పుడు ఇబ్బంది. ఎందుకంటే షాప్ యజమానులు వాటిని తీసుకోవటానికి నిరాకరిస్తుంటారు. అయితే ఇకపై ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి చిరిగిన లేదా పాడైన నోట్లను మార్చుకోవచ్చు. ఒకవేళ ఏటీఎంలో నకిలీ నోట్లు వచ్చినప్పటికీ ఇదే పద్ధతిని పాటించాలి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
ATM నుంచి చిరిగిన నోటును మార్చడానికి.. మీరు ATM నుంచి డబ్బును విత్ డ్రా చేసిన తేదీ, సమయం, ఏటీఎఁ స్థలాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నోటు మార్చుకోవడానికి ఈ వివరాలన్నీ బ్యాంకులో వెల్లడించాలి. మీరు బ్యాంక్ ఏటీఎం మెషీన్ నుంచి జనరేట్ చేసిన రసీదుని కూడా బ్యాంకులో చూపించాలి. స్లిప్ లేకపోతే.. మీరు ఖచ్చితంగా బ్యాంకులో డబ్బు విత్ డ్రా చేసిన మెసేజ్‌ను చూపించాల్సి ఉంటుంది.

RBI మార్గదర్శకాలు..
ఏటీఎంల నుంచి వచ్చే చిరిగిన నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అసలు.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం నోట్లను ఏటీఎంలో పెట్టే ముందు సంబంధిత సిబ్బంది వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ ఆ తర్వాత కూడా ఎటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి నోట్లను మార్చుకోవచ్చు. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.

బాధ్యత ఎవరిది..
ఏటీఎం నుంచి వచ్చే పాడైన నోట్ల బాధ్యత పూర్తిగా బ్యాంకుదే. ఏటీఎంలో డబ్బులు వేసే ఏజెన్సీ ఈ బాధ్యతను తీసుకోదు. ఇలాంటి నోట్లను మార్చటానికి బ్యాంక్ నిరాకరించటం కుదరదు. చిరిగిన నోట్లపై ఫిర్యాదు చేసేందుకు ఎస్‌బీఐ ఓ ఆప్షన్‌ను ఇచ్చింది. వినియోగదారులు crcf.sbi.co.in/ccf/ని సందర్శించడం ద్వారా తమ ఫిర్యాదును నమోదుచేయవచ్చు. చిరిగిన నోట్లను మార్చకపోతే సదరు బ్యాంక్ పై రిజర్వు బ్యాంక్ రూ.10 వేల వరకు ఫైన్ వేయవచ్చు.


Click it and Unblock the Notifications