బంగారం ధరకి-గోల్డ్ లోన్‌కి లింకేంటి..? Gold Loan తీసుకునేవారికి లాభమా.. నష్టమా..?
Gold Loan: బంగారంపై రుణం పొందటం మిగిలిన అన్ని రకాల లోన్స్ కంటే సులభతరమైనది. పైగా అప్పిచ్చే ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులకు సైతం ఇది సేఫ్ వ్యాపారం. సంక్షోభ సమయాల్లో డబ్బుకు బదులుగా చాలా మంది బంగారాన్ని కొని దాచుకుంటుంటారు. ఇలాంటి బంగారం విషయంలో అనేక లాభనష్టాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000 మార్కును దాటేసింది.
బంగారంపై రుణం అనగానే మనలో చాలా మందికి ముందుగా గుర్తుకువచ్చేది ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ లోన్. కేరణకు చెందిన ఈ రెండు సంస్థలు దేశంలోని బంగారంపై రుణాల వ్యాపారంలో చాలా ప్రాచుర్యం పొందాయి. వీటి గ్రూప్ వ్యాపారాల్లో 98 శాతం గోల్డ్ లోన్స్‌దే. మార్కెట్లో బంగారం ధర పెరగటం వల్ల దానిపై రుణాలు తీసుకునేవారి సంఖ్య భారీగా పెరుగుతోందని తెలుస్తోంది. దీనికి తోడు వారు తీసుకునే అప్పు విలువ సైతం ధరలకు అనుగుణంగా పెరుగుతుంది. ఇది ఫైనాన్స్ సంస్థలతో పాటు ఇటు కస్టమర్లకు సైతం మేలు చేకూరుస్తుంది.

లోన్ టు వాల్యూ రేషియో తక్కువగా ఉన్నట్లయితే మార్కెట్లో బంగారం ధర పెరగటం వల్ల ఇప్పటికే రుణం పొందిన కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాకట్టులో ఉన్న బంగారంపై అదనపు లోన్ పొందవచ్చు. ఇది పరోక్షంగా గోల్డ్ ఫైనాన్షియర్‌లకు రుణ వృద్ధికి మరింత సహాయం చేస్తుంది. ఇది కంపెనీలకు బలమైన రాబడులను తెచ్చిపెడుతుంది. ధరలు పెరగటం వల్ల రుణ సంస్థలకు మరింత వ్యాపార అవకాశాలు ఉంటాయని వెల్లడైంది.
కస్టమర్లు సైతం గతంలో కంటే ఎక్కువ గోల్డ్ లోన్ తీసుకునేందుకు బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. ఎందుకంటే ఒక పర్సనల్ లోన్ పొందటానికి బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం క్రెడిట్ స్కోర్ తో పాటు ఇతర అనేక ప్రాథమిక అంశాలను పూరించాల్సి ఉంటుంది. కానీ గోల్డ్ లోన్ విషయంలో అలాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి.. ధరల పెరుగుదల బంగారం ఫైనాన్షియర్ల లాభదాయకతపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. పైగా ఈ తరహా రుణాలకు వడ్డీ రేటు తక్కువగా ఉండటం కారణంగా చాలా మంది గోల్డ్ లోన్ తీసుకునేందుకు మక్కువ చూపుతున్నారు.

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నందున ఆభరణాలకు డిమాండ్ భారీగానే పెరిగింది. బంగారం కొనుగోలు దారులు షాపింగ్ చేస్తున్న సమయంలో అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల కారణంగా రేట్లు భారీగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ విషయంలో పెద్ద తగ్గింపు ఉండకపోవచ్చని గోల్డ్ ట్రేడర్స్ భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications