Diwali 2023: సాయంత్రం ముహురత్ ట్రేడింగ్‌లో కొనాలా..?? వద్దా..?? ప్లాన్ చేస్కోండి
Diwali 2023: ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలు తమకు ఎంతో ఇష్టమైన దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారులు సైతం మంచి శుభప్రదంగా భావించే ముహురత్ ట్రేడింగ్ కోసం సిద్ధం అవుతున్నారు.
దీంతో ప్రతి ఏడాది మాదిరిగానే దీపావళి పర్వదినాన పెట్టుబడిదారుల కోసం స్టాక్ మార్కెట్లు సాయంత్రం ఒక గంట పాటు తెరుచుకోనున్నాయి. ముహురత్ అంటే శుభ సమయం అని అర్థం. అందుకే నేడు సాయంత్రం 6 నుంచి 7.25 మధ్య కాలంలో గంట పాటు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ తెరుచుకోనున్నాయి. బీఎస్ఈలో ఈ ప్రత్యేక ట్రేడింగ్ 1957 నుంచి, ఎన్ఎస్ఈలో 1992 నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది. గడచిన 10 ఏళ్లలో ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ లాభదాయకంగానే నిలిచింది.

అయితే ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ రేటింగ్ తాజాగా మూడీస్ తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం నేటి ముహురత్ ట్రేడింగ్ పై ప్రతికూలంగా ఉంటుందా అనే అనుమానాలు అనేక మంది భారతీయ ఇన్వెస్టర్లలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కొత్త పెట్టుబడి ఏడాదిగా దీనిని భావిస్తూ చాలా మంది తమ పెట్టుబడి పోర్ట్ ఫోలియోలను సరిచేసుకోవటం, వాటి పనితీరును పరిశీలించటం, కొత్త పెట్టుబడులను ప్రారంభించటం చేస్తుంటారు. కేవలం గంట పాటు ట్రేడింగ్ కొనసాగటం వల్ల లిక్విడిటీ చాలా పరిమిత స్థాయిల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ముహురత్ ట్రేడింగ్ సమయంలో భారీ క్వాంటిటీల్లో BUY, SELL ఆర్డర్లు పెట్టొద్దని సూచిస్తున్నారు.
ఇప్పటికే మార్కెట్లోని అనేక బ్రోకరేజ్ సంస్థలు దీపావళి 2023 ట్రేడింగ్ కోసం కొన్ని షేర్లపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్ల పనితీరు కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం కన్సాలిడేట్ అవుతున్నాయి. దీంతో షేర్ల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని రెలిగేర్ బ్రోకింగ్ ప్రతినిధి సూచించారు. నేటి ట్రేడింగ్ సెషన్లో లాభాల కోసం ట్రేడింగ్ కంటే దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించాలని మంచి ఫండమెంటల్స్ ఉన్న షేర్లను ఎంచుకోవాలని ట్రేడ్ జిని ప్రతినిధి చెప్పారు. మన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమమని మాస్టర్ ట్రస్ట్ ప్రతినిధి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications