Notes Ban: తాజాగా రిజర్వు బ్యాంక్ దేశంలో సర్క్యూలేషన్ లో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. దీనిపై చేసిన ప్రకటనతో చాలా మంది తమ వద్ద ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలా అని తర్జనబర్జన పడుతున్నారు. అయితే ఇప్పుడు సమస్యల్లా బ్యాంక్ అకౌంట్లు లేని వ్యక్తులు రూ.2000 నోట్లను ఎలా మార్చుకోవాలన్నదే.
రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్నప్పటికీ సెప్టెంబర్ 30 వరకు అవి చలామణిలో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతం 2000 రూపాయల నోట్లు ఉన్నవారు బ్యాంకు నుంచి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఉంది. తక్షణమే 2000 రూపాయల నోట్ల జారీని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. అంటే బ్యాంకులు తమ ఖాతాదారులకు 2000 నోట్లను అందించవు.. ఏటీఎంలలో కూడా ఇవి మాయం కానున్నాయి.

నోట్ల మార్పిడికి బ్యాంకు ఖాతా అవసరమా?
ఎవరైనా ఖాతాదారుడు తనకు ఖాతా ఉన్న బ్యాంకు నుంచి రూ.2000 నోటును మార్చుకోగలరా అని అనుమానం ఉంది. అయితే మార్గదర్శకాల ప్రకారం దేశంలోని ఏ బ్యాంకు బ్రాంచ్ నుంచైనా రూ.2000 నోట్లను ఎవరైనా ఒకేసారి రూ.20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా వెల్లడించింది. అంటే దీని కోసం ప్రత్యేకంగా బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. నోట్లను మార్చుకునే సదుపాయం కూడా ఉచితంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'క్లీన్ నోట్ పాలసీ' కింద రూ.2000 నోటును నిలిపివేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మార్పిడికి గడువును సెప్టెంబరు 30, 2023 వరకు ఇచ్చింది. ఈ లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను తమ దగ్గరలోని బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. 2016లో నోట్ల రద్దు సమయంలో ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లను.. ఆ తర్వాత 2018-19లో ముద్రణను నిలిపివేసినట్లు ఆర్బీఐ పత్రికా ప్రకటన విడుదల చేసింది.


Click it and Unblock the Notifications