Crude Oil: ఒపెక్ దేశాలు తమ చమురు ఉత్పత్తిని తగ్గించాలని అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కొత్త సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మెుండిగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణానికి ఇది ఆజ్యం పోస్తుందని వారంటున్నారు.
ఏప్రిల్ 2 నుంచి రోజుకు 1.16 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించాలని OPEC, రష్యాతో సహా దాని మిత్రదేశాలు నిర్ణయించటంతో బ్యారెల్ చమురు ధర 85 డాలర్లకు చేరుకుంది. ఇది అక్టోబర్ 2022లో ప్రకటించిన రోజుకు రెండు మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి కోతకు అదనం.

ప్రస్తుతం భారత్ తన ఇంధన అవసరాలకోసం 85 శాతం ముడి చమురును దిగుమతి చేసుకోవటంపైనే ఆధారపడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద వినియోగదారు, చమురు దిగుమతిదారుగా భారత్ కొనసాగుతోంది. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచటంతో పాటు.. రూపాయి విలువను తగ్గిస్తుంది. పైగా కరెంట్ ఖాతా లోటును పెంచుంది.
క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును తాకిన నెలల్లో సెన్సెక్స్ రాబడులు బలహీనంగా నమోదయ్యాయని గత గణాంకాలు చెబుతున్నాయి. ధరల పెరుగుదల ఈక్విటీ మార్కెట్లను, వృద్ధి దృక్పథాన్ని దెబ్బతీస్తుందని అవి రుజువు చేస్తున్నాయి. జనవరి 2000 సంవత్సరం నుంచి క్రూడ్ ధరలు 100 డాలర్ల కంటే ఎక్కువ స్థాయిలో కొనసాగినప్పుడు 60 నెలల్లో 35 నెలలు సెన్సెక్స్ ప్రతికూల రాబడులను అందించింది.
ప్రస్తుత వాతావరణాన్ని చూస్తుంటే ఏడాది చివరి నాటికి మళ్లీ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 100 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజుకు 1 మిలియన్ బ్యారెల్స్ సరఫరా తగ్గితే చమురు ధర 20-25 డాలర్ల మేర ప్రభావితం అవుతుందని వారు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుతం నెమ్మదించిన తరుణంలో ఉత్పత్తి కోతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరింత హానికరమని హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications