Inflation: ఈ ఏడాది వడ్డీ రేట్లు తగ్గవు..! ఎల్‌నినో ఎఫెక్ట్.. పూర్తి వివరాలు
Inflation: నెమ్మదిగా దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతోంది. ఈ క్రమంలో రానున్న మరికొన్ని నెలల్లో రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నామంటూ తియ్యటి కబురు చెబుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ అవి ఈ ఏడాది అడియాశలయ్యేటట్లు కనిపిస్తున్నాయి.
వినియోగదారుల ధరల సూచీ(CPI) ఆధారిత ద్రవ్యోల్బణం గడచిన మూడు నెలలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంతృప్తికరమైన స్థాయిలో ఉంది. అయితే RBI ఆందోళనలు తగ్గుముఖం పట్టలేదు. ముఖ్యంగా రుతుపవనాల ఆలస్యం, ఎల్‌నినో ప్రభావం ఎక్కువగానే ఉన్నందున రానున్న రోజుల్లో ప్రభావం ఆహార ద్రవ్యోల్బణంపై కనిపించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చిలో 4.79 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం మే నెలలో 2.91 శాతానికి చేరుకుంది.

ద్రవ్యోల్బణం తగ్గుదల శుభసూచకమని ICRA సీనియర్ ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో ఈ ఏడాది రెండవ అర్థ భాగంలో బలహీన రుతుపవనాల ప్రభావం గురించి సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఖరీఫ్ సీజన్ ఉత్పత్తితో పాటు.. రబీలో విత్తనాలను ప్రభావితం చేస్తుంఎది. పంట దిగుబడి సైతం తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను స్వల్పంగా 5.1 శాతానికి తగ్గించింది.
ద్రవ్యోల్బణంలో స్థిరమైన తగ్గింపు కోసం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇలాంటి సందర్భంలో వర్షాలు తక్కువగా నమోదు కావటం, ఎల్‌నినో రావటం ధరలు పెరుగుదలకు దారితీస్తుందని తెలుస్తోంది. ఇటీవలి మానిటరీ పాలసీ సమావేశంలో మాట్లాడుతూ రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ రుతుపవనాలు, ఎల్ నినో ప్రభావం అనిశ్చితంగా ఉన్నందున ద్రవ్యోల్బణంపై నిశితంగా, జాగ్రత్తగా పర్యవేక్షించడం అవసరమని అన్నారు. అలాగే స్థిరమైన పద్ధతిలో ద్రవ్యోల్బణాన్ని 4 శాతం కంటే తక్కువగా ఉంచడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
ద్రవ్యోల్బణం ఎలా కొలుస్తారు?: భారతదేశంలో ద్రవ్యోల్బణం రెండు రకాలు. ఒకటి రిటైల్.. మరొకటి టోకు ద్రవ్యోల్బణం. రిటైల్ ద్రవ్యోల్బణం రేటు సాధారణ వినియోగదారులు చెల్లించే ధరలపై ఆధారపడి ఉంటుంది. దీనిని వినియోగదారుల ధరల సూచిక (CPI) అని కూడా అంటారు. మరోవైపు టోకు ధరల సూచిక (WPI) అంటే హోల్ సేల్ మార్కెట్‌లో ఒక వ్యాపారి మరొక వ్యాపారి నుంచి వసూలు చేసే ధరలను సూచిస్తుంది.


Click it and Unblock the Notifications