Stock Market: ఈవారం స్టాక్ మార్కెట్ల దారెటు..?? ఏఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయ్..??
Stock Market: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లను ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పుకోవాలి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు గతవారం మెుత్తానికి అరశాతం లాభాలతో గట్టెక్కాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండవ త్రైమాసికం కంపెనీల ఫలితాలు ఆదాయాల క్షీణతతో మెుదలు పెట్టాయి. ముఖ్యంగా ఐటీ సేవల రంగంలోని దిగ్గజ కంపెనీలు మార్కెట్లను ఎక్కువగా నిరాశకు గురిచేశాయి. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల మార్కెట్ల ట్రెండ్ ను ప్రభావితం చేసింది. గతవారం నిఫ్టీ సూచీని పరిశీలిస్తే 36 షేర్లు లాభపడ్డాయి. వీటిలో టాటా మోటార్స్ అత్యధికంగా లాభంతో టాప్ గెయినర్‌గా నిలిచింది.

వచ్చే వారం మార్కెట్లపై బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయాన్ని గమనిస్తే.. క్యూ2 ఫలితాలపై పాజిటివ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నందున మార్కెట్లు తిరిగి పుంజుకుంటాయని అన్నారు. అలాగే మిడిల్ ఈస్ట్ ఆందోళనల్లో సైతం యూఎస్ బాండ్ ఈల్డ్స్ తగ్గటం శుభశూచికంగా చెప్పుకోవచ్చు. అయితే రానున్న అమెరికా ద్రవ్యోల్బణం డేటా ప్రతికూలంగా ప్రభావాన్ని కొంతమేర చూపొచ్చని ఆయన అంచనా వేశారు.
ఇక దేశీయ పరిణామాలను గమనిస్తే.. CPI ద్రవ్యోల్బణం, పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి వంటి అంశాలు సానుకూలతలను పెంచుతున్నాయి. ఇదే సమయంలో పండుగల సీజన్ కారణంగా పెరుగుతున్న వ్యాపారం కొన్ని రంగాల్లో కంపెనీలకు సానుకూల ఆదాయ వృద్ధికి దోహదపడుతుందని నాయర్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆటో, ఫైనాన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు మంచి పనితీరును కనబరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మెుత్తానికి వచ్చే వారం మార్కెట్లు కోటి ఆశలతో మెుదలు కాబోతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఆచితూచి ముందుకు సాగటం కొంత ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications