LIC MF Manufacturing Fund: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మ్యూచువల్ ఫండ్ ఆధ్వర్యంలో కొత్త మ్యూచువల్ ఫండ్ ప్రారంభం అవుతోంది. ఈ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ కింద పెట్టుబడిపెట్టేందుకు ఇన్వెస్టర్లకు అక్టోబర్ 4, 2024 వరకు మాత్రమే అవకాశం ఉంది. సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి అక్టోబర్ 11వ తేదీన యూనిట్లు రానున్నాయని వెల్లడైంది.
ఈ ఫండ్ ముఖ్యంగా తయారీ రంగంపై దృష్టి పెట్టిన పెట్టుబడులకు సంబంధించినది. తయారీ రంగంలో పనిచేస్తున్న కంపెనీల స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక వృద్ధి కోసం ఈ ఫండ్ రూపొందించబడింది. ఫండ్ ప్రధాన లక్ష్యం కాపిటల్ ఎప్రిసియేషన్ సాధించడం. ఈ ఫండ్ పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధులను వివిధ తయారీ రంగానికి చెందిన కంపెనీల ఈక్విటీ లేదా ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలలో పెట్టుబడి చేస్తుంది. తయారీ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాల్లో ఒకటిగా ఉండటం వల్ల, దీని వృద్ధి పెరుగుతున్న దేశీయ, అంతర్జాతీయ డిమాండ్‌ను తీర్చడానికి సహాయపడుతుంది.

ఈ ఫండ్ ప్రధాన పెట్టుబడి వ్యూహం తయారీ రంగానికి చెందిన వివిధ సబ్-సెక్టార్లలోని కంపెనీలలో పెట్టుబడి పెట్టడం. ఈ రంగం ఆటోమొబైల్స్, ఫార్మా, కెమికల్స్, ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ వంటి విభాగాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రంగంలో ఉన్న కంపెనీలు సాధారణంగా మెరుగైన లాభదాయకత, వృద్ధి అవకాశాలను చూపుతాయి. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తయారీ రంగంలో ఒక ప్రముఖ దేశంగా ఎదుగుతున్న వేళ ఎల్ఐసీ దీనిని ఎంచుకోవటం భవిష్యత్తు రాబడులపై రియల్ పిక్చర్ చూపుతోంది. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియాని భారీ స్థాయిలో ముందుకు తీసుకెళుతున్న వేళ ఈ రంగంలో పెట్టుబడులకు పెరుగుదల కల్పించాయి. దీని ఫలితంగా స్కీమ్ పెట్టుబడిదారులకు దీర్ఘకాలంలో మరింత నష్ట రహిత పెట్టుబడులను అందించే అవకాశం ఉంది.
ఈ ఫండ్ హై రిస్క్, హై రివార్డ్ తరహా పెట్టుబడిగా పరిగణించబడుతుంది. తయారీ రంగంలో ఉన్న పెట్టుబడులు మార్కెట్ మార్పులపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఈ రంగంలో పెట్టుబడులు మార్కెట్ వ్యత్యాసాలు, ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు వంటి అంశాలపై ప్రభావితమవుతాయి. అందువల్ల దీర్ఘకాలంలో రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే వీటిలో పెట్టుబడులకు ఆసక్తి చూపటం ఉత్తమం. ఫండ్ ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన డబ్బులను 80 శాతం మేర తయారీ కంపెనీల్లోని ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత మార్గాల్లో ఇన్వెస్ట్ చేయనుంది. మిగిలిన 20 శాతం పెట్టుబడులను మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ కంపెనీలు కాకుండా ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్ చేయనుంది.
ఎల్ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ ఎక్కువగా ప్యాసివ్ ఇన్‌కమ్‌ను ఆశిస్తున్నవారికంటే, పెట్టుబడులు పెంచుకునే వారికే మంచిది. ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం పెద్ద పాత్ర పోషిస్తున్న క్రమంలో దీని ద్వారా పెట్టుబడిదారులు మంచి రాబడులను ఆశించవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంతైనా పెట్టొచ్చు. స్కీముకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లేదా సమీపంలోని వారి కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అలాగే వారి కాల్ సెంటర్ ద్వారా కూడా సమాచారం పొందవచ్చు.


Click it and Unblock the Notifications